శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరూ.కోటి చొప్పున పరిహారమివ్వాలి

14 జులై, 2026

jagan.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • గల్లంతైన మత్స్యకారులపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం

  • బాధిత కుటుంబాల పరామర్శలో వైఎస్‌ జగన్‌

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : బోటు బోల్తా పడి సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం స్పందించకపోతే, రానున్న కాలంలో తమ ప్రభుత్వం ఏర్పడిన నెల లోపల ఆ సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. చేపల వేటకు వెళ్లి సముద్రంలో పడవ బోల్తా పడటంతో చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలను మంగళవారం విశాఖ పాత నగరం జబ్బర్ తోటలో జగన్ పరామర్శించారు. ఆ ఘటనలో ప్రాణాలతో బయటపడిన బోటు యాజమాని, మత్స్యకారుడు కారి చిన్నాతో మాట్లాడి ప్రమాద వివరాలు, ప్రభుత్వ సాయంపై తెలుసుకున్నారు. అనంతరం జబ్బర్‌తోట జంక్షన్‌ వద్ద మీడియాతో జగన్ మాట్లాడుతూ బోటు ప్రమాదంపై కొద్దిసేపటికే అధికారులకు సమాచారం అందినా, వారు సకాలంలో స్పందించలేదన్నారు. వెంటనే స్పందిస్తే మత్స్యకారులు బతికేవారని తెలిపారు. అడుగడుగునా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా పట్టించుకోలేదని విమర్శించారు. హోం మంత్రి, మత్స్య శాఖ మంత్రి స్పందించలేదని, మత్స్యకారులంటే ఈ ప్రభుత్వానికి ఎందుకంత నిర్లక్ష్యమని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వానికి కనీసం మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు. మొక్కుబడిగా బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సహాయం చేశారని, అది ఏ మాత్రమూ సరిపోదని, కోటి ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రమాదం నుంచి బయటపడిన బోటు చిన్నాకు కూడా అంతే ఆర్థిక సాయం చేయాలని, సముద్రంలో మునిగిపోయిన బోటుకు పరిహారం చెల్లించాలని కోరారు. విశాఖ తీరానికి కేవలం పది నాటికన్ మైళ్ల దూరంలోనే ప్రమాదం జరిగినా మత్స్యకారులను టిడిపి కూటమి ప్రభుత్వం రక్షించలేకపోయిం దన్నారు. మత్స్యకారుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ తరపున రూ.7 లక్షల చొప్పున సహాయం చేస్తామని, ప్రమాదం నుంచి బయటపడిన చిన్నాను ఆదుకుంటామని జగన్‌ హామీ ఇచ్చారు. తొలుత ఆయన మత్స్యకార కుటుంబాలను పరామర్శించగా పలువురు మాట్లాడుతూ గాలింపు చర్యలు సరిగా జరగలేదని, అధికార యంత్రాంగం సకాలంలో స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ ‌వెంట శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్‌‌నాథ్‌, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌ ‌కుమార్‌, ధర్మశ్రీ తదితరులు ఉన్నారు.​​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్