mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భూముల విలువను తగ్గించారు

2 రోజుల క్రితం

land
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 18, 2026, 12:34 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

పరిశీలించాలని సిఆర్‌‌డిఎకు వరల్డ్ బ్యాంకు లేఖ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి పరిధిలో భూముల విలువ నిర్ధారణపై ప్రపంచ బ్యాంకుకు ఉండవల్లి రైతులు ఫిర్యాదు చేశారు. భూముల విలువకు సంబంధించి రైతులకు పరిహారం ఇచ్చే సమయంలో తక్కువ చేసి చూపుతున్నారని, అప్పులు పొందే సమయంలో రూ.కోట్లలో చూపిస్తున్నారని అందులో పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన వరల్డ్ బ్యాంకు అధికారి గెరాల్డ్ పాల్ ఒలీవర్ జూన్‌ ‌మొదటి వారంలో సిఆర్‌‌డిఎకు లేఖ పంపారు. ఉండవల్లి గ్రామంలో భూముల విలువ నిర్ధారణ, రక్షణ నిబంధనల ఉల్లంఘనలపై కొత్త ఫిర్యాదు వచ్చిందని, దీనిపై పరిశీలించాలని అందులో పేర్కొన్నారు. తమకు అందిన ఫిర్యాదులో భూముల విలువ నిర్ధారణలో తీవ్ర వ్యత్యాసం ఉందని, ఇది ప్రాజెక్టు డాక్యుమెంటులో సెక్షన్-4, (రక్షణ వ్యవస్థలు), ఆసియా అభివృద్ధి బ్యాంక్ ‘ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డాక్యుమెంట్’లోని పేరా 35లో నిర్దేశించిన ‘పునరుద్ధరణ వ్యయం’ సూత్రాలను ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తోందని రైతులు పేర్కొన్నట్లు తెలిపారు. ఎపిసిఆర్‌‌డిఎ 210 మిలియన్‌ డాలర్ల స్ట్రాటజిక్ ల్యాండ్ మానిటైజేషన్ లక్ష్యాన్ని సాధించడం కోసం బ్యాంకుల వద్ద భూములకు అధిక వాణిజ్య, రియల్ ఎస్టేట్ విలువలు ఉన్నట్లు చూపిస్తున్నారని, క్షేత్రస్థాయిలో మాత్రం, స్థానిక రైతులతో వివాదాలను పరిష్కరించడానికి ఎకరాకు కేవలం రూ.25 లక్షల చొప్పున నిర్ధారిస్తున్నారని పేర్కొన్నట్లు వివరించారు. గజం రూ.40 వేల నుంచి రూ.50 వేలు ఉందని ప్రపంచ బ్యాంకుకు ఐసిఎఐ నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. అంటే ఎకరం రూ.25 కోట్లుగా నిర్ధారించారు. క్షేత్రస్థాయిలో 2014 రాష్ట్ర విభజనకు ముందే ఉండవల్లిలో సారవంతమైన భూముల విలువ ఎకరాకు కనీసం రూ.2.5 కోట్లుగా ఉందని, ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ధరలు ఎకరాకు రూ.10 కోట్ల నుండి రూ.30 కోట్ల వరకు పలుకుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. 1.78 బిలియన్‌ డాలర్ల అంతర్జాతీయ రుణాన్ని పొందేందుకు భూముల అసలైన ధరను వాడుకుంటున్నారని తెలిపారు. ఇటువంటి తేడాల వల్ల రైతులు పరిహారం పొందే విషయంలో తీవ్రంగా నష్టపోతున్నారని అందులో పేర్కొన్నారు. దీనిపై భూముల వివరాలు నివేదిక ఇవ్వాలని సిఆర్‌‌డిఎ ఉన్నతాధికారులు ఉండవల్లి యూనిట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టరును వివరణ కోరినట్లు తెలిసింది. దీనిపై జూన్‌ ‌రెండో వారంలో ఉండవల్లి ఎస్‌‌డిసి.. సిఆర్‌‌డిఎకు భూముల విలువపై నివేదిక పంపించారు. ఉండవల్లి గ్రామంలో భూముల ధరలపై ప్రాథమిక మార్కెట్ విలువ వివరాలను అందించాల్సిందిగా మంగళగిరి జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌ను కోరామని, 2013, 2015, 2017, 2018, 2019, 2025 సంవత్సరాల్లో భూముల ధరలు సవరించినట్లు తెలిసిందని తెలిపారు. 2025 అక్టోబరు రెండో తేదీన చివరి సారిగా భూముల ధరలను సవరించారని, దీని ప్రకారం మెట్ట, మాగాణి వ్యవసాయ భూముల ప్రాథమిక మార్కెట్ విలువ ఎకరాకు రూ. 26.22 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా, హార్టికల్చర్ పంటలు ఉన్న భూముల విలువ ఎకరాకు రూ.51.12 లక్షలకు పెరిగిందని తెలిపారు. ఇళ్ల స్థలాల విలువలు చదరపు గజానికి రూ.5,750గా నిర్ధారించారని వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్