- మరో నలుగురి పరిస్థితి విషమం
లాస్ గల్లార్డోస్: ఆగ్నేయ స్పెయిన్‌లోని అల్మెరియా ప్రావిన్స్‌ను వణికించిన కార్చిచ్చు మరింత విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న 93 ఏళ్ల బ్రిటిష్ మహిళ మృతి చెందడంతో మరణాల సంఖ్య 13కు చేరింది. ఆమెకు శరీరంపై 20 శాతం కాలిన గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఏడుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ముగ్గురు బెల్జియం పౌరులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. లాస్ గల్లార్డోస్ మునిసిపాలిటీ పరిధిలో ఈ కార్చిచ్చు కారణంగా 7,000 హెక్టార్లకు పైగా (సుమారు 17,300 ఎకరాలు) అటవీ ప్రాంతం దగ్ధమైంది. స్పెయిన్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన కార్చిచ్చుల్లో ఇదొకటిగా అధికారులు పేర్కొంటున్నారు. ఫ్రాన్స్, బ్రిటన్, బెల్జియం అధికారుల సహకారంతో కొనసాగుతున్న దర్యాప్తులో ఇంకా 10 మంది ఆచూకీ లభించలేదని ఫోరెన్సిక్ విభాగం వెల్లడించింది. గురువారం ప్రారంభమైన ఈ కార్చిచ్చు ప్రస్తుతం అదుపులోకి వచ్చినట్లు అండలూసియా ప్రాంతీయ ప్రభుత్వ అధ్యక్షుడు జువాన్మా మోరెనో తెలిపారు. దీంతో నిరాశ్రయులైన వెయ్యికి పైగా స్థానికులను తిరిగి వారి ఇళ్లకు వెళ్లేందుకు అధికారులు అనుమతించారు.
స్పెయిన్‌లో వేసవి కాలంలో ప్రతిరోజూ సగటున 15 నుంచి 22 కార్చిచ్చులు నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.







కామెంట్‌లు (0)