ప్రజాశక్తి - ఆనందపురం : ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ భూసేకరణకు సంబంధించి రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సిపిఎం నాయకులను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకుని ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సిపిఎం మాజీ కౌన్సిలర్ గంగారావు, భీమిలి డివిజన్ కార్యదర్శి ఆర్.ఎస్.ఎన్. మూర్తి తదితరులను తర్లువాడ జాతీయ రహదారి వద్ద పోలీసులు అడ్డగట్టి పోలీసు వాహనంలో స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ, గూగుల్ డేటా సెంటర్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించకుండా, వారి తరఫున ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. రైతులను కలవకుండా గ్రామాల్లోకి వెళ్లనివ్వకపోవడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని అన్నారు. ఇదిలా ఉండగా, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం. జగ్గు నాయుడు, జిల్లా కమిటీ సభ్యుడు ఎం.అప్పలరాజు తదితరులు ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అదుపులో ఉన్న నాయకులను కలిసి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే మీడియాను స్టేషన్‌లోకి అనుమతించకపోవడంతో సిపిఎం నాయకులు, కార్యకర్తలు స్టేషన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తర్లువాడ ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో రైతులు పోలీస్ స్టేషన్‌కు చేరకుండా ఆంక్షలు విధించారని సిపిఎం నాయకులు ఆరోపించారు. అయినప్పటికీ కొంతమంది రైతులు స్టేషన్‌కు చేరుకుని అదుపులో ఉన్న నాయకులకు మద్దతు ప్రకటించేందుకు ప్రయత్నించగా, వారిని కూడా పోలీసులు అడ్డుకున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సిపిఎం నాయకులు, కార్యకర్తలు, రైతులు, శ్రేయోభిలాషులు ఆనందపురం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కొనసాగించారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
గూగుల్ డేటా సెంటర్ రైతులను కలిసేందుకు వెళ్తున్న సిపిఎం నేతల అరెస్ట్
13 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 08:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)