- 13 మంది దుర్మరణం
జకార్తా: ఇండోనేషియాలో పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తున్న ప్రయాణికులు ప్రయాణిస్తున్న పికప్ ట్రక్కు ఘోర రోడ్డు ప్రమాదానికి గురికావడంతో 13 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం జావా ద్వీపంలోని ఇంద్రమాయు ప్రాంతం, కియాజరన్ కులోన్ గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. సమీప గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరైన అనంతరం ప్రయాణికులు ఓపెన్ పికప్ ట్రక్కులో స్వగ్రామానికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు. హైవేపై యూ-టర్న్ తీసుకునేందుకు పికప్ ట్రక్కు వేగం తగ్గించి ఆగిన సమయంలో, వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో పికప్ ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లేన్‌లోకి దూసుకెళ్లగా, ఎదురుగా వస్తున్న మరో లారీ కూడా దానిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పికప్ ట్రక్కులో ప్రయాణిస్తున్న పలువురు రోడ్డుపై పడిపోగా, 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఐదుగురు గాయపడగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.







కామెంట్‌లు (0)