శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పిట్టల్లా రాలిపోతున్నారు..

13 జులై, 2026

heat wave
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 10:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఐరోపాను వణికించిన వడగాలులు - 10 వేలు దాటిన మరణాలు

బ్రస్సెల్స్: ఐరోపా దేశాలను రికార్డు స్థాయి వడగాలులు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. జూన్ చివరి వారంలో సంభవించిన తీవ్రమైన వేడిమి కారణంగా 10,650 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఐరోపా ఆరోగ్య నెట్‌వర్క్ యూరోమోమో (EuroMOMO) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, మృతుల్లో అత్యధికులు 65 ఏళ్లు పైబడినవారే. వడదెబ్బ, గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలతో మరణాలు గణనీయంగా పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఈ కాలంలో కోవిడ్-19తో పాటు ఇతర అంటువ్యాధులు పెద్దగా నమోదు కాకపోవడంతో, మరణాల పెరుగుదలకు తీవ్ర వడగాలులే ప్రధాన కారణమని పరిశోధకులు పేర్కొన్నారు.

మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పులే ఈ తీవ్ర ఉష్ణోగ్రతలకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జూన్ 22 నుంచి 28 వరకు ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ తదితర దేశాలు అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి. ఫ్రాన్స్, బెల్జియంలలో అత్యధిక మరణాలు సంభవించగా, బెల్జియం చరిత్రలో ఇదే అత్యధిక మరణాల సంఖ్యగా అధికారులు పేర్కొన్నారు.

ఇంపీరియల్ కాలేజ్ లండన్‌తో పాటు పలు సంస్థలు నిర్వహించిన మరో అధ్యయనం ప్రకారం, మే–జూన్ నెలల్లో ఇంగ్లాండ్, వేల్స్‌లో సంభవించిన వడగాలుల సమయంలో 2,700 మంది మరణించారు. వీటిలో 42 శాతం మరణాలు గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతోనే సంభవించినట్లు అధ్యయనం తేల్చింది. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, పలు దేశాల్లో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశారు. అధికారులు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్