mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శాంతి ఒప్పందంపై సంతకాలు..

7 గంటల క్రితం

peace
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 02:06 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- నేడు అధికారికంగా సంతకాల కార్యక్రమం

ఫ్రాన్స్‌ : పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు ఉద్దేశించిన శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌ అధ్యక్షులు సంతకాలు చేశారు. దీంతో ఒప్పందం తక్షణమే అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం హర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ తెరుస్తుంది. ఇరాన్‌ ఓడరేవులపై విధించిన దిగ్బంధాన్ని అమెరికా ఎత్తివేస్తుంది. ఇరాన్‌ పునర్నిర్మాణానికి 300 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందుతుంది. ఇరాన్‌పై విధించిన అన్ని రకాల ఆంక్షలను అమెరికా తొలగిస్తుంది. శాంతి ఒప్పందంలో ఇరాన్‌ అణు కార్యక్రమం ప్రస్తావన లేదు. దీనిపై కాల్పుల విరమణ అమలులో ఉండే 60 రోజుల కాలంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ‌జి-7 సదస్సుకు హాజరైన సందర్భంగా ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. ఈ ఒప్పందం 'ఆర్థిక విపత్తు'ను తప్పిస్తుందని ఆయన చెప్పారు. ఇరాన్‌తో తుది ఒప్పందం కుదరని పక్షంలో ఆ దేశంపై బాంబు దాడులు తప్పవని హెచ్చరించారు. శాంతి ఒప్పందంపై ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ బుధవారమే సంతకం చేశారని టెహ్రాన్‌ ధ్రువీకరించింది. అమెరికాపై తన అపనమ్మకం అలాగే ఉండిపోయిందని, టెహ్రాన్‌ వేలు ట్రిగ్గర్‌ పైనే ఉన్నదని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌, చర్చల ప్రతినిధి మహమ్మద్‌ బాఘర్‌ ఘలీబఫ్‌ చెప్పారు. అమెరికా కనుక తన హామీలను నెరవేర్చని పక్షంలో తామూ వాటికి కట్టుబడి ఉండబోమని స్పష్టం చేశారు. వర్సైల్లెస్‌ ప్యాలెస్‌లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ ఇచ్చిన విందు సందర్భంగా ఎంఒయు హార్డ్‌ కాపీపై ట్రంప్‌ సంతకం చేశారు. ఆ సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆయన వెనకే నిలుచుని ఉన్నారు. ట్రంప్‌ సంతకం చేసిన ఒప్పంద పత్రాన్ని అధికారులు ఇరాన్‌కు పంపారు. దానిపై టెహ్రాన్‌లో పెజెష్కియాన్‌ సంతకం చేస్తుండగా తీసిన చిత్రాలను ఇరాన్‌ ప్రభుత్వ మీడియా ఐఆర్‌ఎన్‌ఎ ప్రచురించింది. ఇరాన్‌ కోరిక మేరకు ఎంఓయూను ఆంగ్లంలోనూ, పార్సీ భాషలోనూ ముద్రించారు. 'సంతకం చేశాను' అని ట్రంప్‌ విలేకరులకు చెప్పారు. శాంతి ప్రణాళిక ప్రపంచవ్యాప్త మాంద్యాన్ని నివారిస్తుందని ఆయన తెలిపారు. జి-7 సదస్సు జరిగిన ఎవియన్‌-లెస్‌-బెయిన్స్‌లోని రిసార్టులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్థిక విపత్తును చూడాలని తాను అనుకోవడం లేదని చెప్పారు. యుద్ధం కొనసాగితే అదే సంభవించి ఉండేదని అన్నారు. 'నాకు తెలిసింది ఒక్కటే. మనం శాంతికి అవకాశాల గురించి మాట్లాడిన ప్రతిసారీ స్టాక్‌ మార్కెట్‌ రాకెట్‌ మాదిరిగా దూసుకుపోయింది. రాజీకి రాలేము వంటి ప్రతికూల విషయాలు చెప్పినప్పుడు మాత్రం అది భారీగా పతనమైంది' అని తెలిపారు. మాక్రాన్‌ ఇచ్చిన విందుకు హాజరైన అనంతరం ట్రంప్‌ వాషింగ్టన్‌ బయలుదేరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్