ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రష్యా చ‌మురుశుద్ధి క‌ర్మాగారంపై ఉక్రెయిన్‌ మెరుపు దాడి

1 గంట క్రితం

russia
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 08:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కీవ్‌ : అమెరికా అండదండలతో పదేపదే రష్యాపై కాలుదువ్వుతున్న ఉక్రెయిన్‌ ‌మరోమారు దుందుడుకు చర్యలకు పాల్పడింది. సమర రీజియన్లోని సిజ్రాన్‌ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్‌లతో ఉక్రెయిన్‌ ‌మెరుపు దాడులు చేపట్టినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. శని, ఆదివారాల్లో ఈ దాడులు జరిగినట్లు ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. ఈ రిఫైనరీ ఏటా 8.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల చమురును శుద్ధి చేయగలదు. ఆ రిఫైన‌రీ నుంచి సమర రీజియన్‌కు అవసరమైన పెట్రోల్‌, డీజిల్‌, ఏవియేషన్‌ ఫ్యూయల్ వెళ్తాయి. వాటిని రష్యా సైనిక దళాలు కూడా వినియోగిస్తాయి. దీనిని రోస్‌నెఫ్ట్‌ కార్పొరేషన్‌ నిర్వహిస్తోంది. తాజా దాడితో ఇక్కడ కార్యకలాపాలను నిలిపివేశారు. గతంలో ఈ రిఫైనరీని లక్ష్యంగా చేసుకొని ఇదే ఏడాది ఏప్రిల్‌ 18, మే 11వ తేదీల్లో ఉక్రెయిన్‌ దాడులు చేసింది. ఉక్రెయిన్‌ ఇక్కడితో ఆగకుండా అజోవ్‌ సముద్రంలో 10 ట్యాంకర్లు, నాలుగు ఫెర్రీలను కూడా ధ్వంసం చేసింది. అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకుంటూ ఈ ట్యాంకర్లు రష్యా చమురును విక్రయిస్తుంటాయి. ఇక ధ్వంసమైన ఫెర్రీలు రష్యా సేనలకు లాజిస్టిక్స్ అవసరాలు, కార్గో తరలింపునకు వినియోగిస్తున్నారు. ఈ నెల 11న భారీగా లూబ్రికెంట్‌ ఆయిల్‌ తరలిస్తున్న ఓ రైలును టోక్‌మాక్‌ వద్ద ఉక్రెయిన్‌ దళాలు ధ్వంసం చేశాయి. దాంతోపాటు పెద్ద ఎత్తున చమురు ట్యాంకర్లపై దాడులు చేసినట్లు ఉక్రెయిన్‌ రక్షణ దళాలు ప్రకటించుకొన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్