- క్షిపణులు, డ్రోన్‌లతో విధ్వంసం
- గల్ఫ్‌పై ప్రతిదాడులకు దిగిన టెహ్రాన్
- హర్మూజ్ మళ్లీ మూసివేత
- సైప్రస్ నౌకపై ఇరాన్ దాడి...గల్లంతైన భారతీయుడు
వాషింగ్టన్/ టెహ్రాన్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. అమెరికా పెద్ద ఎత్తున క్షిపణి, డ్రోన్‌లతో ఇరాన్‌పై విరుచుకుపడింది. దీంతో కీలక హర్మూజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నానని ఇరాన్ ప్రకటించింది. ఆదేశాలను దిక్కరించిన సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్న జిఎఫ్‌ఎక్స్ గెలాక్సీ నౌకపై దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. ఆ నౌకలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో 11 మంది భారతీయులు ఉండగా వారిలో 10 మంది సురక్షితంగా బయటపడగా ఒకరు గల్లంతయ్యారు. ఈ దాడిని భారత విదేశాంగ శాఖ ఖండించింది. జలసంధిలో నౌకలపై జరుగుతున్న వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపింది. ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని, సమస్యలను దౌత్య చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలను కోరింది.
ఇరాన్‌పై భీకర దాడులు చేశాం : అమెరికా
వాణిజ్య నౌకలపై దాడులకు ప్రతిగా 140 ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడులు చేశానని అమెరికా సెంట్రల్ కమాండ్ చెప్పింది. వీటిలో సైనిక మౌలిక సదుపాయాలు, క్షిపణి-డ్రోన్ కేంద్రాలు, నౌకాదళ సామర్ధ్యాలు, పేలుడు పదార్థాల నిల్వ కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, కోస్తా నిఘా ప్రాంతాలు ఉన్నాయని వివరించింది. మూడు రోజులలో మొత్తంమీద 300కు పైగా దాడులు చేశామని వివరించింది. అమెరికా దాడుల కారణంగా ఇరాన్‌లోని పలు ఓడరేవు పట్టణాలలో పేలుళ్లు సంభవించాయి. ఇరాన్‌లోని కెర్మన్‌లో కమ్యూనికేషన్ టవర్‌పై అమెరికా జరిపిన దాడిలో ఇద్దరు గాయపడ్డారు. దక్షిణ బుషెహర్ రాష్ట్రంలోని ఐదు నగరాలు...అసాలుయెహ్, దిర్, బుషెహర్, దష్తీ, తంగెస్తాన్‌లపై అమెరికా సేనలు దాడి చేశాయి. బుషెహర్ రాష్ట్రం ఇరాన్ దక్షిణ తీరంలో ఉంది. దీనిపై అమెరికా సేనలు పదే పదే దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన దాడులలో రాష్ట్రంలోని పౌర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. బుషెహర్ అణు విద్యుత్ ప్లాంటు సమీప ప్రాంతాలపై కూడా అమెరికా దాడులు చేసింది. అమెరికా దాడులలో ఇరాన్ సైనికాధికారి ఒకరు చనిపోయారు.
అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా...
మరోవైపు ఇరాన్ రివల్యూషనరీ గార్డులు కూడా గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేశారు. జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ వైమానిక స్థావరంపై బాలిస్టిక్ క్షిపణుల దాడి జరిగింది. ఈ దాడిలో కమాండ్ కంట్రోల్ కేంద్రం, ఎంక్యూ-9 డ్రోన్ స్టేషన్లు ధ్వంసమయ్యాయి. ఇరాన్ ప్రయోగించిన మూడు క్షిపణులు జోర్డాన్‌ను తాకాయి. ఈ దాడిలో పరికరాలకు స్వల్పంగా నష్టం జరిగింది. ఒమన్‌లోని ముసందం ప్రాంతంలో అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడి జరిపింది. యుద్ధ విమానాలలో ఇంధనాన్ని నింపే వేదికలపై క్షిపణులతో దాడి చేశామని ఐఆర్‌జిసి తెలిపింది.
అమెరికా మూల్యం చెల్లిస్తుంది : టెహ్రాన్
తన అనుమతి లేని మార్గంలో ప్రయాణిస్తున్నందునే నౌకపై దాడి చేశానని ఇరాన్ తెలిపింది. ఈ ఘటన జరిగిన తర్వాత జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ ప్రాంతంలో అమెరికా జోక్యం నిలిచిపోయే వరకూ హర్మూజ్ మూసివేత కొనసాగుతుందని రివల్యూషనరీ గార్డులు స్పష్టం చేశారు. ఏకపక్ష ఒప్పందాల శకం ముగిసిందని ఇరాన్ చర్చల ప్రతినిధి మహమ్మద్ బాఖర్ ఖలీబఫ్ చెప్పారు. మాట నిలుపుకోవాలని, లేకుంటే మూల్యం చెల్లించుకోవాలని అమెరికాను హెచ్చరించారు. హర్మూజ్‌ను తిరిగి తెరవడానికి సంబంధించిన ఎంఒయులోని ఐదవ ఆర్టికల్ ఇమేజ్‌ను సామాజిక మాధ్యమ వేదికలో ఆయన పోస్ట్ చేశారు. ఇదిలావుండగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రాంతీయ నేతలతో టెలిఫోన్ సంభాషణలు జరుపుతూ తాజా పరిణామాలను వివరిస్తున్నారు. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఒమన్ విదేశాంగ మంత్రి అల్బుసైదీలతో ఆయన చర్చలు జరిపారు. హర్మూజ్ పై మస్కట్‌లో ఒమన్‌తో జరుపుతున్న చర్చలలో ఖతార్ ప్రతినిధి బృందం కూడా చేరిందని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై చెప్పారు. ఇటీవల అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన చర్చలలో ఖతార్ ప్రాంతీయ మధ్యవర్తిగా వ్యవహరించిందని గుర్తు చేశారు. హర్మూజ్‌లో నౌకల రాకపోకల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారని వివరించారు. కాగా తమ దేశంపై ఇరాన్ జరుపుతున్న దాడులను ఖతార్ తీవ్రంగా ఖండించింది.
హర్మూజ్ సురక్షితం కాదు..
ఇరాన్ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ ప్రకారం, ఈ ప్రాంతంలో అమెరికా సైనిక బలగాల అక్రమ కదలికల వల్ల హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడం ప్రస్తుతం సాధ్యం కాదు. ప్రశాంతత పునరుద్ధరణ అనంతరం, అన్ని అభ్యర్థనలు షెడ్యూల్ ఆధారంగా సమీక్షించి, అవసరమైన అనుమతులు జారీ చేస్తామని అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది.








కామెంట్‌లు (0)