బెంగళూరు : నటుడు ప్రకాష్‌రాజ్‌పై బెంగళూరు కోర్టు మరోసారి నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యు) జారీ చేసింది. కర్ణాటక సహా మూడు రాష్ట్రాల్లో నాలుగు వేర్వేరు ఓటర్ల జాబితాల్లో పేరు ఉందన్న ఆరోపణలపై న్యాయవాది కె.దిలీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా జూన్ 12న ఈ వారెంట్ జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు బుధవారం తెలిపాయి. ప్రకాష్‌రాజ్‌పై ఎన్‌బిడబ్ల్యు జారీ కావడం ఇది మూడవసారి. గతంలో ఫిబ్రవరి 17న పోలీస్ కమిషనర్ సమన్లు జారీచేసినప్పటికీ.. ఆ చిరునామాలో ప్రకాష్‌రాజ్ లేరని పోలీసులు తెలిపారు. మార్చి 17న మొదటి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. నటుడు ఇంటిని ఖాళీ చేయడంతో విచారణకు హాజరుకాలేదని, ఆయనకు ఎన్‌బిడబ్ల్యు జారీ చేయాలని మార్చి 17 కోర్టు పేర్కొంది. అనంతరం ఈ కేసును ఏప్రిల్ 17కి వాయిదా వేసింది. అప్పుడు కూడా విచారణకు హాజరు కాలేదని, తిరిగి ఎన్‌బిడబ్ల్యుని జారీ చేసింది. జడ్జి (ప్రిసైడింగ్ ఆఫీసర్ ) శిక్షణకు వెళ్లారని పేర్కొంటూ జూన్ 12న మూడవసారి ఎన్‌బిడబ్ల్యు జారీ చేసినట్లు వెల్లడించాయి. తదుపరి విచారణను జూన్ 25( గురువారం)కి వాయిదా వేసింది.
2019 లోక్‌సభ ఎన్నికలు
2019 లోక్ సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుండి ప్రకాష్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బెంగళూరులోని శాంతినగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు కావడంతో పాటు, ప్రకాష్ రాజ్ పేరు తమిళనాడులోని వేళచ్చేరి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు చోట్ల, తెలంగాణలోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా నమోదై ఉందని న్యాయవాది కె.దిలీప్ కుమార్ పిటిషన్‌లో పేర్కొన్నారు. 2023లో ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రాతినిధ్య చట్టం ,1950 లోని సెక్షన్లు 31, 125(ఎ) కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధించి 2025, ఆగస్ట్ 1న సమన్లు జారీ చేసింది.








కామెంట్‌లు (0)