న్యూఢిల్లీ : రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ను ఆర్‌టిఐ పరిధిలోకి తీసుకురావాలని సిపిఐ(ఎం) ఎంపి జాన్ బ్రిట్టాస్ సూచించారు. ఈ అంశంపై కేంద్రహోంమంత్రికి లేఖ రాశారు. ఈ వైఖరిని పున:పరిశీలించాలని ఆ లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ ట్రస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా ప్రకటించినంత మాత్రాన ఆర్‌టిఐ పరిధికి వెలుపల ఉంచలేమని ఆయన అన్నారు. ప్రభుత్వం ఆమోదించిన పథకం ద్వారా ఈ ట్రస్ట్ ఏర్పాటైందని, పార్లమెంటరీ చట్టం కింద సేకరించిన భూమిని కలిగి ఉందని అన్నారు. అలాగే ఈట్రస్ట్ పాలనాయంత్రాంగంలోకి ప్రభుత్వ ప్రతినిధులైన ఐఎఎస్ అధికారులను నామినేట్ చేశారని అన్నారు. ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్ 2(హెచ్) ప్రకారం.. సదరు ట్రస్ట్ ‘‘ ప్రజా ప్రాధికార సంస్థ’’ కాదని పేర్కొంటూ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సిఐసి) గతేడాది జూన్6న ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. ఆ ఆదేశాలను ప్రస్తావిస్తూ.. ఆ నిర్నయం ప్రధానంగా కేంద్ర హోంశాఖ తీసుకున్న వైఖరిపైనే ఆధారపడి ఉందని బ్రిట్టాస్ పేర్కొన్నారు. అలాగే, ఈ విషయంలో తన వైఖరి పున:పరిశీలించాలని ఆయన శాఖను కోరారు. ఈ సమస్య కేవలం ఒక ఆర్‌టిఐ దరఖాస్తుకు మాత్రమే పరిమితం కాదని బ్రిట్టాస్ వాదించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం ఆమోదించిన పథకం ద్వారా ఏర్పాటై, కేంద్ర ప్రభుత్వం నుండి ఆస్తిని పొందిన ఒక ట్రస్ట్, ఆర్‌టిఐ చట్టం నిర్దేశించిన జవాబుదారీతనం పరిధికి వెలుపల ఉండాలా అని ప్రశ్నించారు.
అయోధ్య భూ వివాదానికి సంబంధించి 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం చేపట్టిన ప్రభుత్వ చర్యలతోనే ఈ ట్రస్ట్ ఏర్పాటైందని అన్నారు. 'అయోధ్యలోని నిర్దిష్ట ప్రాంతాల సేకరణ చట్టం-1993' కింద ఈ ట్రస్ట్‌కు సంబంధించిన పథకాన్ని కేంద్రం రూపొందించిందని, ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, గెజిట్ నోటిఫికేషన్ ద్వారా సేకరించిన భూమిని దానికి అప్పగించిందని ఆయన గుర్తుచేశారు. ఆ ట్రస్ట్ ఏర్పాటు, విధివిధానాలను కూడా ప్రభుత్వమే నిర్ణయించిందని, ట్రస్ట్‌లోని మొత్తం 15 మంది సభ్యులలో 12 మందిని మొదట కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయగా, మిగిలిన ముగ్గురిని మొదటి సమావేశంలో ఎంపిక చేశారని ఆయన పేర్కొన్నారు. ఆ ట్రస్టు ప్రభుత్వ యాజమాన్యంలో గానీ, నియంత్రణలో గానీ, లేదా గణనీయంగా ప్రభుత్వ నిధులతో నడపబడటం లేదని సిఐసి నిర్ధారించినప్పటికీ, ప్రభుత్వ నోటిఫికేషన్ లేదా ఉత్తర్వు ద్వారా స్థాపించబడిన లేదా ఏర్పాటు చేయబడిన సంస్థలను స్వతంత్రంగా వర్తింపజేసే సెక్షన్ 2(హెచ్) (డి) ను ఆ పరిగణనలు అధిగమించకూడదని ఆయన వాదించారు. ట్రస్ట్ పాలనా యంత్రాంగంలో కేంద్ర, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాల నామినీలు, అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్‌తో సహా ప్రస్తుతం విధి నిర్వహణలో ఉన్న ఐఎఎస్‌లు ఉన్నారని అన్నారు. ట్రస్టులో కేంద్రం తరపున ఉన్న ప్రస్తుత ప్రతినిధి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి అని బ్రిట్టాస్ పేర్కొన్నారు.
ట్రస్ట్ పూర్తిగా ప్రైవేటు స్వభావం కలిగి, ప్రభుత్వ జవాబుదారీతనం పరిధికి అతీతంగా ఉన్నప్పుడు, దాని పాలనా నిర్మాణంలో ప్రభుత్వ ప్రాతినిధ్యాన్ని కొనసాగించడం అవసరమని ప్రభుత్వమే ఎందుకు భావించిందని ప్రశ్నించారు. పార్లమెంటరీ చట్టం కింద సేకరించిన భూమిని ఈ ట్రస్ట్ నిర్వహిస్తోందని, భారతదేశం మరియు విదేశాలలోని భక్తుల నుండి విరాళాలు స్వీకరిస్తోందని, అందువల్ల పాలన, ఆర్థిక నిర్వహణ, ఒప్పందాలు మరియు విరాళాల వినియోగంలో పారదర్శకతపై అనుమానాలు ఏర్పడుతున్నాయని అన్నారు. శ్రీ మాతా వైష్ణో దేవి ష్రైన్ బోర్డ్ సంస్థ తరహాలో మతపరమైన స్వయంప్రతిపత్తి, ప్రజా జవాబుదారీతనం రెండూ కలిసి ఉండగలవని బ్రిట్టాస్ అన్నారు. ట్రస్ట్‌పై ఆర్‌టిఐ చట్టం వర్తింపుపై తన సూచనను సమగ్రంగా సమీక్షించి, సవరించిన వైఖరిని తగిన కోర్టు ముందు ఉంచాలని, తద్వారా ఈ అంశంపై అధికారిక న్యాయ నిర్ణయం లభించే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)