ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస నాయుడుకు ఉపాధ్యాయుల వినతి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్: ప్రస్తుతం జరుగుతున్న జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా అంతర్ జిల్లా బదిలీలపై వచ్చిన ఉపాధ్యాయులకు, వారు సర్వీసులో చేరిన అసలు తేదీనే సీనియారిటీ ప్రాతిపదికగా తీసుకోవాలని కోరుతూ అంతర్జిల్లా బదిలీ ఉపాధ్యాయులు ఆదివారం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస నాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇతర జిల్లాల నుండి కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత ఇబ్బందులు, అత్యవసర కారణాల దృష్ట్యా తాము గతంలో చేసిన సేవలను వదులుకుని ప్రస్తుత జిల్లాకు బదిలీపై వచ్చామని తెలిపారు. అయితే ఇప్పుడు జరుగుతున్న జిల్లాల పునర్విభజన ప్రక్రియలో తమను జూనియర్లుగా పరిగణించే అవకాశం ఉందని, తద్వారా తమను మళ్లీ ఇతర జిల్లాలకు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేసే పరిస్థితి ఏర్పడుతుందనే సమాచారంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ తమను ఏజెన్సీ ప్రాంతాలకు పంపించడం వల్ల కుటుంబ జీవితం, పిల్లల చదువులు, వృద్ధుల సంరక్షణతో పాటు వ్యక్తిగత పరిస్థితులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని వారు వాపోయారు. కాబట్టి, ప్రభుత్వం చేపట్టే జిల్లాల పునర్విభజన బదిలీల్లో తమ మొత్తం సర్వీసును పరిగణనలోకి తీసుకునేలా ప్రభుత్వం మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని ఎమ్మెల్సీని కోరారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో ఉపాధ్యాయులు వెంకటరమణ, హరిబాబు, బంగార్రాజు, నారాయణరావు తదితరులు ఉన్నారు.







కామెంట్‌లు (0)