న్యూఢిల్లీ : మెటాకు కేంద్రప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు ఆదివారం తెలిపాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బు చెల్లించి ఇచ్చే కొన్ని ప్రకటనల్లో బాలల లైంగిక దోపిడీ, వేధింపులకు (సిఎస్‌ఇఎఎం/సిఎస్ఎఎం) సంబంధించిన కంటెంట్ కనిపించిందన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం నోటీసులిచ్చిందని పేర్కొన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఈ తరహా కంటెంట్‌కు ప్రాప్యత కల్పించే అన్ని ప్రకటనలు, పోస్టులను వెంటనే తొలగించాలని ఆదేశించింది. అలాగే, ఈ అంశంపై ఏడు రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని మెటాను కోరింది. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఐటి చట్టం, పోక్సో చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. మెటా యాజమాన్యంలోనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రెండూ పనిచేస్తున్నాయి.
బిబిసి ప్రచురించిన ఒక దర్యాప్తు కథనంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ కథనం ప్రకారం.. ‘రేప్ వీడియో’, ‘చైల్డ్ వీడియో’ వంటి పదాలతో ఉన్న కొన్ని చెల్లింపు ప్రకటనలు ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించాయని, అవి వినియోగదారులను టెలిగ్రామ్ ఛానళ్లకు మళ్లించాయని పేర్కొంది. అక్రమ కంటెంట్‌ను విక్రయానికి ఉంచినట్లు కూడా తెలిపింది. దీంతో ఇటువంటి ప్రకటనలకు ఎలా అనుమతి లభించిందో, ఆరోపణలు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారో, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి రక్షణ చర్యలు చేపడతారో వివరించాలని కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసింది.
బాలల లైంగిక వేధింపుల కంటెంట్‌ను కోరడం, పంచుకోవడం లేదా ప్రచారం చేయడం పట్ల తమకు జీరో టాలరెన్స్ విధానం ఉందని మెటా తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించే కంటెంట్‌ను గుర్తించి తొలగించేందుకు అధునాతన ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని, భద్రతా వ్యవస్థలను నిరంతరం మెరుగుపరుస్తున్నామని పేర్కొంది.
పిల్లలను లైంగికంగా అసభ్యకరంగా చిత్రీకరించే ఎలక్ట్రానిక్ కంటెంట్‌ను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం ఐటీ చట్టం ప్రకారం తీవ్రమైన నేరం. ముఖ్యంగా ఐటీ చట్టంలోని సెక్షన్ 67బి ఆన్‌లైన్‌లో బాలల లైంగిక వేధింపుల కంటెంట్‌కు సంబంధించిన నేరాలపై కఠినమైన శిక్షలను నిర్దేశిస్తుంది.







కామెంట్‌లు (0)