గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ధర్మేంద్ర ప్రధాన్‌ను రాష్ట్రప‌తి బర్తరఫ్ చేయాలి

2 రోజుల క్రితం

cjp protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 11:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- పదో రోజుకు చేరుకున్న వాంగ్‌చుక్ నిరాహార

- సిజెపికి ఉద్య‌మానికి వ్య‌వ‌సాయ కార్మిక సంఘాలు సంఘీభావం

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకుని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను కేంద్ర‌మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని వ్య‌వ‌సాయ, గ్రామీణ‌ కార్మిక సంఘాల జాతీయ వేదిక డిమాండ్ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష ప‌దో రోజుకు చేరింది. కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) చేపట్టిన ఆందోళ‌న సోమ‌వారం నాటికి 17వ రోజు కొన‌సాగింది. అయితే సోనమ్ వాంగ్‌చుక్ ఈ పది రోజుల్లో దాదాపు ఏడు కిలోలు బరువు తగ్గారని వైద్యులు తెలిపారు. మరోవైపు దీక్షను అణచివేసేందుకు ఢిల్లీ పోలీసులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని సిజెపి కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఆదివారం రాత్రి, జంతర్ మంతర్ వద్ద మహిళా నిరసనకారులను ఫోటోలను పోలీసులు తీయడంపై వివాదం చెలరేగింది. అయితే , పోలీసుల తీరు సరికాదని సిజెపి అభ్యంతరం తెలిపింది. డిసిపి ఆదేశాల మేరకే ఫొటోలు తీస్తున్నామంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. దీనికి సిజెపి కార్య‌క‌ర్త‌లు నిర‌శించారు. అలాగే, మ‌హారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్‌లో నిర్వహించిన ఆందోళ‌న‌లో సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ రాజీనామా చేయాల్సిందేనని సిజెపి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, యువ‌కులు భారీగా పాల్గొన్నారు.

ఇదోక చారిత్రక దీక్ష..

జంతర్ మంతర్ వద్ద సిజెపి చేస్తున్న ఆందోళనకు అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ‌ కార్మికు జాతీయ ఐక్య వేదిక‌ సంఘీభావం తెలిపింది. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడ‌బ్ల్యుయు) ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, బికెఎంయు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గుల్జార్ సింగ్ గోరియా, జాతీయ వేదిక నాయ‌కులు సాహిల్ బ‌హ‌దూర్‌ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్, విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న దీక్ష వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, దేశ విద్యా వ్యవస్థను కాపాడడం కోసం, భావితరాల భవిష్యత్తును రక్షించడం కోసం జరుగుతున్న ఒక చారిత్రక దీక్ష అని పేర్కొన్నారు. విద్యను రక్షించడం అంటే దేశ భవిష్యత్తును రక్షించడమేనని అన్నారు. ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత‌, రైతులు, కార్మికులు, మేధావులు, ప్రజాస్వామ్య శక్తుల మద్దతు క్రమంగా పెరుగుతోందని తెలిపారు. దేశాన్ని కుదిపేసిన నీట్ ప్రశ్నాపత్రాల లీక్ కేవలం కొందరు వ్యక్తుల నేరం కాదని, మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న కేంద్రీకృత, కార్పొరేట్ అనుకూల విద్యా విధానాల ప్రత్యక్ష ఫలితమేనని విమర్శించారు. పరీక్షల నిర్వహణను కేంద్రీకరించి, జవాబుదారీతనాన్ని నిర్వీర్యం చేసిన విధానాల వల్లే ఈ కుంభకోణం జరిగిందన్నారు. నీట్ కుంభకోణానికి పూర్తి నైతిక, రాజకీయ బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌దేనని పేర్కొంటూ, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయకుండా పదవిని అంటిపెట్టుకుని ఉండటం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని అన్నారు. రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకుని ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశ భావితరాల భవిష్యత్తును కాపాడేందుకు జరుగుతున్న ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని, విద్యార్థులు, యువత, రైతులు, కార్మికులు, ప్రజాస్వామ్యవాదులందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్