mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వృద్ధాప్యం శాపమా?

3 గంటల క్రితం

old age
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 11:07 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

సొంత ఇంట్లోనే ఒంటరితనం

కుటుంబాల్లో వృద్ధులపై వేధింపులు

ప్రభుత్వాల నుంచి కానరాని చర్యలు

న్యూఢిల్లీ : భారత్‌‌లో వృద్ధులు తమ జీవిత చరమాంకంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ‘ప్రపంచ వృద్ధులపై వేధింపులు అవగాహన దినోత్సవం (డబ్ల్యూఇఎఎడి) సందర్భంగా వెలుగులోకి వచ్చిన అధ్యయనాలు ఒక చేదు వాస్తవాన్ని బయటపెట్టాయి. కుటుంబ వ్యవస్థ వృద్ధులకు రక్షణ కవచమనే భావనకు విరుద్ధంగా భారత్‌‌లో పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారిపై జరిగే చాలా వేధింపులు వారి సొంత ఇళ్లలోనే జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న 82 శాతం మంది వృద్ధుల్లో చాలా మంది శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక వేధింపులను ఎదుర్కొంటున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో వృద్ధులు తమ జీవిత చివరి దశలో గౌరవానికి నోచుకోలేకపోతున్నారు. ఒంటరితనపు శిక్ష‍ను ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోనే పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నప్పటికీ.. అవి బయటకు కనిపించకపోవడం ఆందోళనకరం.

భారత్‌‌లో పెరుగుతున్న వృద్ధ జనాభా

భారత్‌లో 60 ఏళ్లు పైబడినవారి జనాభా 2036 నాటికి 23 కోట్లకు పైగా చేరుతుందని అంచనా. ప్రస్తుతం దేశంలో 10 కోట్ల మందికి పైగా వృద్ధులు ఉన్నారు. దేశం మొత్తం జనాభాలో వారి వాటా సుమారు 9 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుదల ఆయా రాష్ట్రాల్లో భిన్నంగా ఉంది. ఉత్తర, తూర్పు రాష్ట్రాలు యువ జనాభాతో నిండి ఉన్నాయి. దక్షిణ రాష్ట్రాలు వేగంగా వృద్ధాప్య సమాజాలుగా మారుతున్నాయి. 2036 నాటికి కేరళలో ప్రతి నలుగురిలో ఒకరు వృద్ధులే ఉండే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి.

కొడుకుల నుంచే వేధింపులు...

హెల్పేజ్ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం... వృద్ధులపై వేధింపులకు పాల్పడేవారిలో కుమారులే మొదటి స్థానంలో ఉన్నారు. వేధింపులు ఎదుర్కొన్న వృద్ధుల్లో 35 శాతం మంది తమ కుమారులే ప్రధాన కారణమని చెప్పారు. ఆ తర్వాత కోడళ్ల పాత్ర ఎక్కువగా కనిపించింది. ఇక జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌ ‌సి ఆర్‌బి) గణాంకాల ప్రకారం.. 2023-24 మధ్య వృద్ధులపై నేరాలు, వేధింపుల కేసులు 17 నుంచి 18 శాతం వరకు పెరిగాయి. ఎల్డర్‌లైన్ హెల్ప్‌లైన్‌కు వస్తున్న ఫిర్యాదుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 2024లో నిర్వహించిన హెల్పేజ్ ఇండియా సర్వేలో 65 శాతం మంది వృద్ధులు ఆర్థిక భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి స్వంత ఆదాయం లేదు. వృద్ధ మహిళల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఆరోగ్య పరంగా కూడా సగానికి పైగా వృద్ధులు అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. 31 శాతం మందికే ఆరోగ్య బీమా ఉండటం గమనార్హం.

చట్టాల్లో పరిమితులు

వృద్ధుల సంక్షేమం కోసం 2007లో రూపొందించిన ‘మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్’ ఉన్నప్పటికీ.. కుటుంబాల్లో జరిగే మానసిక వేధింపులు, అవమానాలు, ఆర్థిక దోపిడీ వంటి అంశాలను చట్టపరంగా నిరూపించడం కష్టమవుతోంది. న్యాయస్థానాల్లోనూ క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. కేరళ హైకోర్టు 2024లో ఇచ్చిన ఒక కీలక తీర్పులో కుటుంబ వివాదాలను ‘వృద్ధులను వదిలివేయడం’గా పరిగణించలేమని స్పష్టం చేసింది. పూర్తిగా బాధ్యతలను వదిలించుకునే ఉద్దేశంతో వృద్ధులను నిర్లక్ష్యం చేసినప్పుడు మాత్రమే అది నేరంగా పరిగణించబడుతుందని పేర్కొంది. ఇలాంటి పరిమితులు దేశంలోని వృద్ధులకు శాపంగా మారుతున్నాయి.

ప్రపంచవ్యాప్త సమస్య

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ వృద్ధులపై వేధింపులు జరుగుతున్నాయి. 35 దేశాల్లో నిర్వహించిన 94 అధ్యయనాల సమీక్ష ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురు వృద్ధుల్లో ఒకరు ఏదో ఒక రూపంలో వేధింపులను ఎదుర్కొంటున్నారు. భావోద్వేగ, మానసిక వేధింపులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఆ తర్వాత స్థానల్లో నిర్లక్ష్యం, ఆర్థిక దోపిడీ ఉన్నాయి. ఆసియాలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వృద్ధులపై జరుగుతున్న ఈ అమానవీయ పరిస్థితులు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని సామాజికవేత్తలు అంటున్నారు.

నీతి ఆయోగ్‌ ‌సిఫారసులపై విమర్శలు

భారత్‌‌లో వృద్ధులను సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా చూడాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్‌ సూచిస్తోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది వృద్ధులు పెన్షన్, ఆరోగ్య భద్రత, సంరక్షణ సేవలకు దూరంగా ఉన్న పరిస్థితుల్లో.. మార్కెట్ ఆధారిత పరిష్కారాలు మాత్రమే సరిపోవని సామాజిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విఫలమవుతున్న ప్రభుత్వాలు

దేశంలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతున్నప్పటికీ.. వారి సంక్షేమం, భద్రత, సంరక్షణకు సమగ్ర విధానాలు, పథకాలు, తగిన బడ్జెట్ కేటాయింపులు కనిపించడం లేదని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజాన్ని నిర్మించిన వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే ఆ అభివృద్ధికి అర్థం ఉండదని అంటున్నారు. భారత్‌‌లో వృద్ధుల గౌరవం, భద్రత, స్వావలంబనను కాపాడటం కుటుంబాలకే కాదు.. ప్రభుత్వానికీ, సమాజానికీ ఒక పెద్ద బాధ్యతగా మారాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్