- సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాల్లో మార్పులు
న్యూఢిల్లీ : దేశ న్యాయవ్యవస్థలో అవినీతి ఉందంటూ రాజ్యాంగబద్ధ సంస్థను నిర్వీర్యం చేసేలా ఉన్న పాఠ్యాంశాలను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) తొలగించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని చవిచూసిన ఎన్‌సిఇఆర్‌టి ఎట్టకేలకు దిగొచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు 8వ తరగతి సాంఘికశాస్ర్తంలోని వివాదాస్పద పాఠ్యాంశాల్ని తొలగించి కొత్త అధ్యాయాన్ని విడుదల చేసింది. న్యాయ వ్యవస్థలో అవినీతి, కోర్టుల్లో భారీగా కేసుల పెండింగ్, కీలక తీర్పులకు సంబంధించిన అంశాల్ని తొలగించగా- ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్), ట్రైబ్యునల్స్, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ఎడిఆర్) విధానాలపై కొత్త సమాచారంతో పాఠ్యాంశాలను తీర్చిదిద్దింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన 8వ తరగతి సాంఘికశాస్ర్తం పుస్తకంలోని అధ్యాయం 4 అయిన 'ది రోల్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఇన్ సొసైటీ (సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర)' పాఠంలో న్యాయ వ్యవస్థలో అవినీతి, కేసుల పెండింగ్, మౌలిక వసతుల కొరత, న్యాయమూర్తుల కొరత వంటి అంశాలు ఉండటంతో తీవ్ర వివాదం చెలరేగింది. ఈ అధ్యాయం- న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపైనే సుప్రీం కోర్టు సుమోటాగా విచారణ చేపట్టింది. అనంతరం సాంఘికశాస్ర్తం పుస్తకాలకు సంబంధించిన ముద్రణ పూర్తయిన అలాగే డిజిటల్ కాపీలు అన్నింటినీ వెంటనే ఉపసంహరించు కోవాలని ఆదేశించింది. ఇంకా ఆ పుస్తకాన్ని మళ్లీ ముద్రించడం, డిజిటల్ రూపంలో ప్రచురించడం లేదా పంపిణీ చేయడంపై పూర్తి నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఎన్‌సిఇఆర్‌టి క్షమాపణలు కూడా చెప్పింది.
కొత్త పుస్తకంలో ఏం మారింది?
సవరించిన పాఠ్య పుస్తకంలో పలు కీలక మార్పులు చేశారు. 'స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఎందుకు అవసరం?' అనే ప్రారంభ ప్రశ్నను తొలగించి 'న్యాయబద్ధమైన, సామరస్య పూరకమైన సమాజం కోసం అసలు న్యాయం ఎందుకు అవసరం? అనే కోణంలో కొత్త అంశాన్ని చేర్చారు. ఇంకా 'న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు ' అనే విభాగాన్ని పూర్తిగా తొలగించారు. ఇందులో కోర్టుల్లో కేసుల భారీ పెండింగ్‌కు న్యాయమూర్తుల కొరత, క్లిష్టమైన న్యాయ ప్రక్రియ, బలహీనమైన మౌలిక వసతులే కారణమని పేర్కొన్నారు. ఈ అంశాలు ఇప్పుడు పుస్తకంలో లేవు. అసలు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో అవినీతి అనే విభాగాన్ని కూడా పూర్తిగా తొలగించారు. ఈ భాగంలో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ- 'న్యాయ వ్యవస్థలో అవినీతి, దుర్వినియోగం జరిగే సందర్భాలు ఉన్నాయని' పేర్కొన్నారు. ఈ అంశాలే తీవ్ర వివాదానికి దారితీశాయి.
కొత్తగా చేర్చిన అంశాలివే
తాజా ఎడిషన్‌లో విద్యార్థులకు న్యాయ వ్యవస్థపై సమగ్ర అవగాహన కల్పించే ఉద్దేశంతో పలు కొత్త అంశాల్ని చేర్చారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ - పిల్ ), ప్రజలకు న్యాయం అందుబాటులోకి తీసుకురావడంలో న్యాయ వ్యవస్థ పాత్ర, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలు (ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్- ఎడిఆర్), ట్రైబ్యునల్స్ వంటి అంశాల్ని వివరంగా పొందుపరిచారు. కొత్త పుస్తకంలోని ప్రచురణ గమనికలో - 'సుప్రీం కోర్టు సుమోటో రిట్ పిటిషన్ (సివిల్) నం.1/2026 లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం సమీక్ష నిర్వహించి ఈ పుస్తకాన్ని విడుదల చేసినట్లు ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొంది. కేంద్ర విద్యా శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మార్చి 16న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 'ది రోల్ ఆఫ్ ది జ్యుడీషియరీ ఇన్ సొసైటీ' అధ్యాయాన్ని పూర్తిగా రీరైట్ చేసినట్లు వెల్లడించింది.
కాగా గతంలో విడుదలైన పుస్తక రూపకల్పన బృందంలో మొత్తం 51 మంది సభ్యులు ఉండగా, తాజా సవరించిన ఎడిషన్‌లో 48 మంది మాత్రమే ఉన్నారు. వివాదాస్పద అధ్యాయానికి బాధ్యత వహించినట్లు భావించిన మిషెల్ డానినో, సుపర్ణా దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్ పేర్లను జాబితా నుంచి ఎన్‌సిఇఆర్‌టి తొలగించింది.








కామెంట్‌లు (0)