- ఎల్‌ఏ-2028 ఒలింపిక్స్‌కు ముందు ఐఓసీ కీలక నిర్ణయం..
- రష్యన్ అథ్లెట్లకు మార్గం సుగమం
లుసానే: లాస్ ఏంజెల్స్-2028 ఒలింపిక్స్‌కు ముందు రష్యా తిరిగి ఒలింపిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మంగళవారం రష్యన్ ఒలింపిక్ కమిటీ (ఆర్‌ఓసీ)పై 2023లో విధించిన సస్పెన్షన్‌ను తాత్కాలికంగా ఎత్తివేసింది. అయితే రష్యా జాతీయ జెండా, జాతీయ గీతంతో పోటీల్లో పాల్గొనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తరువాత, ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలైన లుహాన్స్క్, డొనెట్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియా ప్రాంతాల ఒలింపిక్ మండళ్లను రష్యన్ ఒలింపిక్ కమిటీ గుర్తించిన నేపథ్యంలో 2023 అక్టోబర్‌లో ఐఓసీ సస్పెన్షన్ విధించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని రష్యా హామీ ఇవ్వడంతో సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు ఐఓసీ తెలిపింది. అయినప్పటికీ ఈ అంశాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొంది.
ఐఓసీ అధ్యక్షురాలు కిర్స్టీ కోవెంట్రీ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని, అయితే ప్రభుత్వ నిర్ణయాలకు క్రీడాకారులను బాధ్యులను చేయకూడదనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి అథ్లెట్‌కు ఒలింపిక్స్‌లో పోటీ చేసే అవకాశం ఉండాలని ఆమె పేర్కొన్నారు.
ఈ నిర్ణయాన్ని రష్యా స్వాగతించింది. రష్యా క్రీడా మంత్రి మిఖాయిల్ డెగ్టియారెవ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు రష్యన్ అథ్లెట్ల పూర్తి పునరాగమనానికి ఇది సానుకూల సంకేతమని అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యన్ అథ్లెట్లు 2024 పారిస్ ఒలింపిక్స్, 2026 మిలాన్-కోర్టినా వింటర్ ఒలింపిక్స్‌లో తటస్థ అథ్లెట్లుగా మాత్రమే పోటీపడ్డారు. ఇదే సమయంలో ప్రభుత్వ మద్దతుతో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న డోపింగ్ కుంభకోణం కూడా రష్యా క్రీడా వ్యవస్థపై ప్రభావం చూపింది. లాస్ ఏంజెల్స్-2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించే రష్యన్ అథ్లెట్లపై కఠిన డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తామని ఐఓసీ స్పష్టం చేసింది.








కామెంట్‌లు (0)