mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తమను తాము అమ్ముకున్న రెబల్ ఎంపిలు : ఆదిత్య థాకరే

2 గంటల క్రితం

Aaditya Thackeray
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 05:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ముంబయి : రెబల్ ఎంపిలు తమను తాము అమ్ముకున్నారని శివసేన (యుబిటి) నేత ఆదిత్య థాకరే విమర్శించారు. వారిని ``కృతజ్ఞత లేని, సిగ్గులేని, అవినీతిపరులైన'' వ్యక్తులుగా అభివర్ణించారు. ఈ రోజు పార్టీ 60వ వార్షికోత్సవమని, మరోసారి నీచమైన రాజకీయాలకు సంబంధించిన ఒక దిగ్భ్రాంతికరమైన ఉదాహరణను చూస్తున్నామని ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. కొందరి మద్దతుతో 2024లో గెలిచిన ఈ నేతలు ఇప్పుడు వారికే ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు 'ఈ చీకటిలో' కేవలం తన పార్టీ చిహ్నమైన 'కాగడా' (టార్చ్ ) మాత్రమే వెలుగును తీసుకురాగలదని ఆదిత్య థాకరే పేర్కొన్నారు. పార్టీని వీడిన ఎంపిలు తమను తాము అమ్ముకున్నారని ఆరోపించారు. మీతో పాటు మీ కీర్తిని, పేరును, కుటుంబ గౌరవాన్ని కూడా పణంగా పెట్టారని మండిపడ్డారు. మహారాష్ట్ర ఈ నీచమైన రాజకీయాలను సహించదని హెచ్చరించారు. శివసేన (యుబిటి)కి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటు చేస్తున్నారన్న ఊహాగానాల మధ్య ఆదిత్య థాకరే స్పందించడం మొదటిసారి కావడం గమనార్హం. ఈ పరిణామంతో నాలుగేళ్ల వ్యవధిలో పార్టీ రెండోసారి చీలిపోయే ప్రమాదం ఉంది.


ద్రోహుల రక్షణ కోసమే పోలీస్ శాఖ ఉందా : సంజయ్ రౌత్

ద్రోహుల రక్షణ కోసమే పోలీస్ శాఖ ఉందా అని శివసేన (యుబిటి) ఎంపి సంజయ్ రౌత్ విమర్శించారు. రెబల్ ఎంపిలకు వై-ప్లస్ భద్రత కల్పించడంపై ఆయన మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీస్ శాఖ కేవలం ద్రోహుల రక్షణ కోసమే ఉందా , ఇది పూర్తిగా ప్రజాధనాన్ని వృధా చేయడమేనని అన్నారు. ఎటువంటి రక్షణ లేకుండా వారు బయట తిరగాలని ఎంపిలకు సవాలు విసిరారు. రెబల్ ఎంపిలు ముందుగా తమ పదవులకు రాజీనామా చేసి, ప్రజా తీర్పుతో తిరిగి ఎంపిలుగా ఎన్నిక కావాలని అన్నారు. కేంద్రమంత్రి పదవి ఎవరు చేపట్టాలనే అంశంపై రెబల్ ఎంపిల్లో భేదాభిప్రాయాలు వచ్చాయని, దీంతో మిగిలిన ఎంపిలకు అదనంగా రూ.25 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదిరిందని అన్నారు.


'ఆపరేషన్ టైగర్'లో భాగంగా ఆరుగురు ఎంపిలు సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాదవ్, భాసాహెబ్ వాక్‌చౌరే, నాగేశ్ పాటిల్-అస్థికర్, ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ లు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అధికార శివసేనలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. గురువారం నిర్వహించిన శివసేన (యుబిటి)పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఆరుగురు ఎంపిలు హాజరుకాలేదు. విప్ జారీ చేసినప్పటికీ గైర్హాజరుకావడంతో పార్టీ వారికి షోకాజ్ నోటీసులు జారీచేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్