- ట్రంప్ వ్యాఖ్యలు
- ఖండించిన ఇరాన్
వాషింగ్టన్/ టెహ్రాన్ : అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుపారేసుకున్నారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇరాన్ నేతలందరూ ఒకే చోట ఉన్నారని, వారిని ఒక్క క్షణంలో లేపేస్తానంటూ హెచ్చరించారు. శనివారం ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఖమేనీ అంత్యక్రియలకు భారీగా జనం తరలిరావడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రజలు ఆయన్ని ద్వేషిస్తారని తాను భావించానన్నారు. అయితే, ఇప్పుడు కనిపిస్తున్నది దొంగ ఏడుపులంటూ చెప్పుకొచ్చారు. ఇరాన్ అగ్ర నాయకత్వం మొత్తం ఒకేచోట ఉందని, వారిని ఒక్క దెబ్బతో లేపేయగలమని, కానీ చర్చలు జరపడానికి ఎవరూ మిగలరనే ఉద్దేశంతోనే అలా చేయడం లేదని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. అమెరికాకు నాగరికత, చరిత్ర లేవంటూ ఘాటుగా విమర్శించింది. అర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందించింది. ‘వ్యక్తులను చంపగలరు, కానీ వారి ఆశయాలను చంపలేరు. మీరు అయతొల్లా ఖమేనీని చంపారు. అంటే మీరు ఒక సుగంధ ద్రవ్యాల సీసాని పగులగొట్టారు. దాని సువాసన ఇప్పుడు ప్రతిచోటా వ్యాపించింది. ఆ సువాసనను మీరు ఆపలేరు’ అని పేర్కొన్నది.







కామెంట్‌లు (0)