- ఆర్ అండ్ బి శాఖ మంత్రి బిసి జనార్థన్ రెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిపోయిన బ్రిడ్జిలకు మోక్షం కల్పిస్తున్నట్లు ఆర్ అండ్ బి శాఖ మంత్రి బిసి జనార్థన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న దాదాపు 14 వంతెనలు నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.90.20 కోట్ల మేర నిధులు మంజూరు చేసినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 14 వంతెనల్లో దాదాపు 12 జిల్లా ప్రధాన రహదారులు (ఎండిఆర్) పరిధిలో ఉండగా, మిగిలిన 2 రాష్ట్ర హైవేలు (ఎస్‌హెచ్) పరిధిలో ఉన్నాయని తెలిపారు. గతంలో వివిధ కారణాలతో అర్ధాంతరంగా మధ్యలో నిలిచిపోయిన అసంపూర్తి బ్రిడ్జిల నిర్మాణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో ప్రత్యేక చొరవ తీసుకోవడం ద్వారా వాటిని తిరిగి చేపట్టి అతి త్వరలో పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లోని ఈ 14 వంతెనలకు సంబంధించి 11 వంతెనల నిర్మాణాలు గతంలో పూర్తయ్యినప్పటికీ, అప్రోచ్ రోడ్లు పూర్తి చేయని పరిస్థితి నెలకొందని తెలిపారు. అదే సమయంలో 3 వంతెనలకు సంబంధించి బ్రిడ్జి నిర్మాణంతో పాటు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉందన్నారు. ప్రధానంగా భూసేకరణలో జరిగిన తీవ్ర జాప్యంతో ఈ వంతెనలు అసంపూర్తిగా నిలిచిపోవడంతో వృథాగా, నిరుపయోగంగా మారిపోయిన పరిస్థితి నెలకొందని తెలిపారు. వీటిలో కొన్ని బ్రిడ్జిలకు సంబంధించి నాబార్డు వంటి పథకాల కింద చేపట్టడం, ఆ పథకాల కాల పరిమితి ముగిసిపోవడం కూడా ఈ ఆలస్యానికి కారణమైందని పేర్కొన్నారు.ఆయా నిర్మాణాలు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వృథాగా పడి ఉన్న క్రమంలో ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుసురావడమే లక్ష్యంగా నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.








కామెంట్‌లు (0)