ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వైసిపి ఓటర్ల ఓట్లు తోలగింపే లక్ష్యంగా సర్‌

2 గంటల క్రితం

appi reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 11:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎమ్మెల్సీ అప్పిరెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ వైసిపికి చెందిన ఓటర్ల పేరు తొలగింపే లక్ష్యంగా కొనసాగుతుందని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. సర్‌ ప్రక్రియలో అధికారుల తీరు వైసిపికి ఇబ్బందులు కలిగించేలా ఉందన్నారు. ఇదే సమయంలో అధికారులు టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మంత్రులు, టిడిపి నేతలు నేరుగా సమీక్షల్లో పాల్గొంటూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. బూత్‌ లెవల్‌ అధికారులపై టిడిపి నాయకుల నుంచి ఒత్తిళ్లు, బెదిరింపులు పెరిగాయని, ఉన్నతాధికారులు కూడా ఆ ఒత్తిళ్లకు తలొగ్గడం ఆందోళనకరమన్నారు. ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇప్పటికీ చాలామందికి అందలేదని, అయినప్పటికీ 99.11 శాతం ఫారాలు పంపిణీ చేశామని ఎన్నికల సంఘం ప్రకటించడం వాస్తవ పరిస్థితులకు విరుద్ధమని తెలిపారు. ప్రజల సందేహాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయడం లేదని, ఎన్యుమరేషన్‌ ఫారాలు టిడిపి ఏజెంట్ల వద్ద ఉన్నాయనే ఫిర్యాదులను కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. మంత్రి నారాయణ ఎస్‌ఐఆర్‌ సమీక్షలో పాల్గొనడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని వెల్లడించారు. ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని పూర్తిగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ప్రస్తుతం ఉన్న గడువును కనీసం మరో నెల రోజుల పాటు పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖ పంపినట్లు వెల్లడించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజలకు ఇంకా పూర్తి అవగాహన లేదని, చైతన్యం కల్పించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆరోపించారు. హడావుడిగా కార్యక్రమాన్ని ముగించే ప్రయత్నం జరుగుతోందన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్