ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ ప్రత్యేక శిబిరాన్ని జూలై 6న ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ సచివాలయం 3వ భవనంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం హాల్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ప్రారంభిస్తారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తదితర అధికారులు పాల్గొంటారని తెలిపింది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరంలో ఎన్యుమరేషన్ ఫారాల ఆన్‌లైన్ సమర్పణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, చిరునామా మార్పు, ఇతర ఓటరు జాబితా సవరణలకు సంబంధించిన అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సేవలను అందిస్తారని తెలిపింది. ఈ శిబిరానికి హాజరయ్యే ఉద్యోగులు 2002 నాటి ఓటరు వివరాలు (అందుబాటులో ఉంటే), తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ప్రస్తుత ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని సూచించింది.








కామెంట్‌లు (0)