విజయవాడ : రంపచోడవరం ఆదివాసీ ర్యాలీపై పోలీసు నిర్బంధాన్ని నిలిపివేయాలని కోరుతూ .... సోమవారం ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు లేఖ రాశారు. గిరిజనుల భవిష్యత్తుకు జీవనాధారమైన 1/70 చట్టాన్ని (ఏజెన్సీ భూముల బదిలీ నియంత్రణ నిబంధనలు) కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ... ఈ రోజు రంపచోడవరంలో ఆదివాసీ గిరిజన సంఘాలు చేపట్టిన ర్యాలీ, సభపై పోలీసులు తీవ్రమైన ఆంక్షలు పెట్టి జనాన్ని రానీయకుండా నిరోధించేందుకు ప్రయత్నిస్తుండటాన్ని సిపిఐ(యం) తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి ఆదివాసి ప్రజలు ప్రత్యేకించి యువతీ యువకులు ప్రశాంతంగా వస్తున్న సందర్భంలో వారిని దారి మధ్యలో పోలీసులు ఆటంకపరిచి రెచ్చగొట్టడం ద్వారా ఏజెన్సీలో అశాంతి పరిస్థితిని ప్రభుత్వమే సృష్టిస్తున్నదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆదివాసి యువత అసంతృప్తికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పారు. వారు చెప్పేది విని 24 వ తేదీ ముఖ్యమంత్రి రంపచోడవరం వస్తున్న సందర్భంగా .... వాటిపై స్పందించి పరిష్కరిస్తే యువతలో ఆందోళన పరిష్కారం అవుతుందని, అందుకు బదులుగా నిర్బంధ పద్ధతుల ద్వారా అడ్డుకోవాలనుకోవడం అవివేకం అని అన్నారు. రానున్న 24 వ తేదీన ముఖ్యమంత్రి సభకు కూడా ఈ విధంగానే జనాన్ని రానీయకుండా ఆటంకపరుస్తారా ? అని ప్రశ్నించారు. అధికార పార్టీకి పోలీసు యంత్రాంగం అన్ని రకాల అండదండలు ఇస్తూ ఆదివాసీల సంఘాలపై మాత్రం ఈ రకంగా నిర్బంధం ప్రయోగించడం దారుణమన్నారు. వెంటనే హోం మంత్రి, డిజిపి జోక్యం చేసుకొని రంపచోడవరం ఆదివాసీ గిరిజనుల సభ ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని వి.శ్రీనివాసరావు కోరారు.









కామెంట్‌లు (0)