సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కవీ వింటున్నావా!

12 గంటల క్రితం

poetry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 04:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

భాష ప్రబంధ కావ్య కన్యకలా

హొయలుపోతున్న అందమైన నడకను గురించి కాదు

భాష నాలుక మీద నేతి ఉండపద్యంలా

కమ్మగా కరిగిపోవడం గురించి అంతకన్నా కాదు

ఇవాళ భాష ఎందుకు అక్షరం అక్షరం

కన్నీళ్లతో రక్తంతో తడుస్తుందో

ఒక్క ముక్కైనా మాట్లాడావా కవీ?

ఇవాళ భాష ఎందుకు ఇనుప పిడికిళ్ల మధ్య

ఊపిరాడకుండా నలిగిపోతుందో

కాస్తా సమయం వెచ్చించి దుఃఖించి

రగుల్ జెండాగా ఒక్కసారైనా మారావా, కవీ?

ఎంతసేపూ నీ ఆరాటాలూ నీ ఆర్భాటాలూ

నీ ఢాంబిక ఉత్తుత్తి ప్రదర్శనలూ

నీ గుంపు రాజకీయ చాతుర్యాలూ

కవీ! కవిత్వాన్ని రంగులపూతలతో ఎన్నాళ్లని మెరిపిస్తావు

నీ ఉపమానాలూ ఉపమేయాలూ

రూపకాలూ అలంకారాలూ అహంకారాలూ

నీ రాచరికపు వజ్రకిరీటాల ధగధగల పొగడ్తలూ

ఇంకెంత మాత్రం చెల్లవుగాక చెల్లవు, కవీ!

కవిత్వం చలువ అద్దాలమేడలను పగులగొట్టి

ఎప్పుడో నేలమీదకి వచ్చిందన్న సంగతి నీకెప్పటికి

అర్థమౌతుందో ఏమో!

అభ్యుదయం పేరుతో అందరి వేదికను

అవకాశవాద అవధాన విద్యతో పావనం చేసి

రోజూ ఏపూటకాపూట భత్యాన్ని

నీ మాంత్రిక సంచిలో వేసుకుని రాత్రి కలల్లో

మురిసిపోవడం కాదు కవీ!

నిజాయితీగా నిర్భయంగా నిటారుగా

నిలబడే నిఖార్సైన ఒక వాక్యంగా మారడం ఎలాగో

ఇప్పటికైనా మించిపోయింది లేదు తెలుసుకో, కవీ!

గుర్తింపు మురికికాల్వలో పడి కొట్టుకుపోయి

మురికివాసన వేయొద్దు సుమీ!

నువ్వైనా నేనైనా కఠోర సాధనలో మునిగితేలితే

తప్పకుండా తలకెత్తుకుని ఊరేగిస్తుంది ఈ లోకం

కవీ వింటున్నావా! వింటున్నావా కవీ!

- బాసు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్