సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వీడ్కోలు సమావేశం

15 గంటల క్రితం

farewell
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 03:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఐదేళ్ల ఆఖరి మెట్టు మీద

సర్వసభ్య సమావేశం

సభ ఉద్దేశానికి సభికుల ఉద్వేగానికి

మధ్యనెక్కడో ముఖం చాటేసుకుంది

ఆత్మీయ ఆలింగనం!

అధికారుల చేతుల్లో కాయితాలూ ఫైళ్ల హడావిడి

ప్రతినిధుల కళ్లల్లో

కాలపరిమితి అప్పుడే ముగిసిందా అని నిర్వేదం!

పార్టీల పేరుతో గుద్దులాట ఉపన్యాసాలు

కండువాల రంగుల్ని బట్టీ కేకలూ నినాదాలు!

స్థాయీ సంఘాల వారీగా

అభివృద్ధి ఆనవాళ్లేమిటని చూస్తే

తాగి తాగి నీళ్లన్నీ ఒట్టబెట్టి

ఎండిపోయిన సముద్రంలో

నులుసుకుంటూ సొరచేపలు..

ఒక్కొక్క ప్రణాళిక

ఒక్కో నివేదికగా మారేసరికి

ఆఖరిముద్ద ఇంకా గొంతుదిగడంలేదని

నీళ్లు తాగుతూ గద్దలు..

ప్రాదేశిక నియోజకవర్గాల వార్షిక బడ్జెట్లవారీగా

తగులూ మిగులూ చూసేటప్పటికి

వ్రత నియమానికి లోబడ్డామని చెప్పి

కళ్లుమూసుకొని పాలు తాగుతూ పులులు..

నిధులూ గ్రాంట్ల లెక్క తేల్చి

ఆమోదించిన ఖర్చు చూడొద్దూ

పళ్లసందుల్లో పుల్ల గుచ్చుకుంటూ

తలుపుల్లేని బోను ముందు

ఆవలిస్తున్నాయి తోడేళ్లు..

చీమల పుట్టని ఆక్రమించి

పిపీలికాల ముందు పీపీలు ఊదుతూ

కునికిపాటు మేలుకొలుపులు

పాడుతున్నాయి పాములు..

మూడంచెల వ్యవస్థలో

అట్టడుగు వరకూ అదే వరస!

బ్యాలెట్ పండగ రోజున

భూమ్యాకాశాలు పట్టనంత సందడి తప్ప

ఎన్నిక మరునాటికే అంతా పాసి క్రతువు!

ఇంతా చూస్తే..

ఈ వీడ్కోలు సభలో కూడా

ప్రజలకు చెప్పేందుకు ఇంకేమీ లేనట్టేనా?

- కంచరాన భుజంగరావు

94415 89602

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్