సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీ భవన్‌లో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, సరుకులు

1 గంట క్రితం

ap bhavan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 06:21 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఏపీ భవన్లో ప్రత్యేక రైస్ అవుట్‌లెట్ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్

- రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాలకూ అత్యుత్తమ నాణ్యతతో కూడిన సరుకులు అందజేత

- కేఎన్ఎం, బీపీటీ వంటి రకరకాల బియ్యం వెరైటీలు అందుబాటులో ఉంచేలా చర్యలు

- ఎన్‌సీసీఎఫ్ ద్వారా 64 రకాల నిత్యావసర సరుకులు సబ్సిడీ ధరలతో విక్రయం

న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో నివసిస్తున్న రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరకే అత్యుత్తమ నాణ్యతతో కూడిన బియ్యం, నిత్యావసర సరుకులను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో, రెసిడెంట్ కమిషనర్ చొరవతో ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక 'రైస్ అవుట్‌లెట్‌'ను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. మన రైతాంగం కష్టపడి పండించిన ధాన్యం రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుందని కొనియాడారు. ముఖ్యంగా ఢిల్లీ నగరంలో స్థిరపడిన, నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ స్వచ్ఛమైన, నాణ్యమైన మన ఊరి రుచులను, వరి వంగడాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అవుట్‌లెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కేఎన్ఎం, బీపీటీ వంటి వివిధ రకాల బియ్యం వెరైటీలతో పాటు, ఎన్‌సీసీఎఫ్ (NCCF) ద్వారా సేకరించిన 64 రకాల నాణ్యమైన సరుకులను కూడా సబ్సిడీ రేట్లతో ఈ కౌంటర్ ద్వారా విక్రయించనున్నట్లు తెలిపారు. ప్రజలకు అందించే ఈ సేవల్లో ఎటువంటి లోపాలు తలెత్తకుండా అర్హత గల నిపుణులను నియమించి పారదర్శకంగా సేవలు అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్, ప్రభుత్వ సలహాదారు ఏకే జైన్, ఏపీ భవన్ అధికారులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్