సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీ వక్ఫ్ బోర్డు డిజిటల్ పాలనలో మరో ముందడుగు

1 గంట క్రితం

wafq
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 06:33 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- త్వరలో వెబ్‌సైట్, మొబైల్ యాప్ ప్రారంభం

- సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు

- ఇన్‌స్పెక్టర్ ఆడిటర్లు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

- కొత్త వ్యవస్థను ప్రారంభించడమే కాదు.. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి

- ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డును ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడిందని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. బోర్డు సేవలు, కార్యకలాపాలను డిజిటలైజ్ చేసేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్, మొబైల్ యాప్ రూపొందించామని, త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో సీఈఓ యాకూబ్ ఖాజీ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ ఆడిటర్లు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో చైర్మన్ అబ్దుల్ అజీజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని సందేశం అందించారు. చైర్మన్ మాట్లాడుతూ, కొత్త వ్యవస్థను ప్రారంభించడం ఒక్కటే కాదని, దాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం కూడా అంతే ముఖ్యమని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఈ డిజిటల్ మార్పులో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర కీలకమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొనసాగుతున్న డిజిటల్ గవర్నెన్స్‌కు అనుగుణంగా వక్ఫ్ బోర్డులోనూ ఆధునిక సాంకేతిక విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అధికారిక ప్రారంభానికి ముందే సిబ్బందిని కొత్త వ్యవస్థ వినియోగానికి సిద్ధం చేస్తున్నామని, తద్వారా పరిపాలనలో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. చైర్మన్ సందేశం అనంతరం ప్రాక్టికల్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి, వెబ్‌సైట్, మొబైల్ యాప్ వినియోగాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించారు. లాగిన్, సమాచార నమోదు, ఇప్పటికే ఉన్న వివరాల పరిశీలన, అప్‌డేషన్, క్షేత్రస్థాయి సమాచారాన్ని డిజిటల్ వ్యవస్థలో పొందుపరిచే విధానాలను దశలవారీగా వివరించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఆడిటర్లు, సిబ్బంది లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో డీఈఈ అబ్దుల్ ఖాదిర్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్