mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లోహ శోకం!

4 గంటల క్రితం

visakha steel
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 04:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రతి దినమూ ప్రమాదం చుట్టూనే

మా పరిభ్రమణం...

అరచేతి గీతల మధ్య

ఓ ప్రయోగ ప్రమిద పట్టుకొని..!

ఒక అడుగు ముందుకు వేస్తుంటే,

వీపు దాపున మృత్యు వాసన

అల్లంత దూరాన అనుసరిస్తున్నట్టే ఉంటుంది,

అల్లం వేర్లలా అట్టడుగు పొరల్లో అల్లుకొంటూ...

మరణం ఒక స్వాగత తోరణమై

వేలాడుతున్న సాంకేతిక ముఖద్వారం గుండానే

మా నిరంతర ప్రయాణం సాగుతుంటుంది

సైరన్ మోత

సైన్యాధిపతి ఊదుతున్న సమర శంఖంలా ప్రేరేపిస్తూనే,

మృత్యు శంఖంలా మరోపక్క

ప్రమాద పతాక ఎగురవేస్తుంటుంది!

లోహ లావాలోకి ఒంటరిగా పోవాలని

ఎవరూ కోరుకోరు,

లోలత్వం ఎంత లాలూచీ పడ్డా...

కానీ అనుకోకుండా

సలసల కాగుతున్న ద్రావణ కలశంలో

రేగిన ఆకస్మిక వాయుగుండం గుండా,

గుండెలు చిక్కబట్టుకొని,

గుప్పుమనబోయిన జేగురు పొగ గుట్టు పట్టుకొని,

రసాయన మిశ్రమంతో మట్టు పెట్టాల్సి ఉంటుంది

అక్కడికక్కడే... అప్పటికప్పుడే... అతి రహస్యంగా...!

పరిష్కారం ఇదేనంటూ

పరిశోధనా పత్రాలు సమర్పించి,

బంగారు పతకాలు గెలిచిన

ఎంత గొప్ప నిష్ణాతులు అయినా,

కాలం కాటు వేస్తే క్షణాలలో

గుప్పెడు బూడిద కణికలు కావలసిందే

కప్ప దాటుకి పిసరంతైనా వీల్లేని అచ్చోట...

నాసి ధాతువుల నాణ్యతపై ధైర్యంగా మాట్లాడలేని

ద్రవ లోహ లోపాలు వల్లకాటిలో వెలిగిస్తాయి

వందలాది చావు దీపాలు వందనాలు అర్పించడానికి...!

పెంచేసుకోవడానికి బంగారు గుడ్లు,

కంచేసుకున్న కంగారు లక్ష్యాలు కావు;

అరక్షిత క్షేత్రంలో చల్లిన ప్రాణాల విత్తనాలు...!

కారు చౌక మూలకాలనే కొని తీరాలన్న నిబంధనలు

సంతకాలను సొంత కళ్లతో చూడనియ్యవు.

సవరించలేని వెలలకు కార్మికుల తలల్ని ముడిపెట్టి,

నెత్తురులో ముంచిన కలంతో వేళ్లాడించడానికి...!

బీమా రాళ్లను విగ్రహాలుగా కొలుస్తున్న రాచ కొలువుల్లో

దైవ ఘటనలపై ధీమాలు పెరిగిపోతుంటాయి

చర్యలు లేని అజ్ఞాత చర్చల్లో...!

ఎన్ని పర్యాయాలో కార్చిచ్చులు

కర్చీఫుల్లో చుట్టేయబడతాయి...!

లాల్ ఖిల్లా లాల్చీలు, నమిలే కిళ్లీలు నమ్మించే

షరారతు షరతుల మామూళ్లుగా...!

వంగ దేశపు వాడు వంగోపెడతాడు,

పంగ నామాల బుర్రకి రంగెయ్యాలని...

వడ్డి దేశపు వాడు తెడ్డు జారవిడుస్తాడు,

దారి తప్పిన నావ నడ్డి విరిచెయ్యాలని...

ఆంధ్రుడి హక్కు మీద పెత్తనం చేసిన ప్రతి వాడూ

పత్తి వత్తుల్లా వాడేసుకొంటున్నారు

తెలుగు వేలుపుల్ని తమ సొంత వెలుగులకై...!

- డా. సుదేరా

97013 47080

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్