సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వ్యథార్తుల యథార్థ కథ కాపలి

1 గంట క్రితం

kapari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 04:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

మూరిశెట్టి గోవిందు జీవితాన్నే తన విశ్వవిద్యాలయంగా మలచుకున్న రచయిత. పల్లె మనుషులతో సహజంగా మమేకమయ్యే స్వభావం ఆయనది. జీవితంలో కొంత ఆలస్యంగా రచనా వ్యాసంగం ప్రారంభించినప్పటికీ, పుత్తూరు–కార్వేటినగరం ప్రాంతీయ యాసను, స్థానిక భాషను అత్యంత సహజంగా సాహిత్యంలోకి తీసుకువచ్చారు. బడుగు, బలహీన, వెనుకబడిన, దళిత వర్గాల జీవితాలను కళ్లకు కట్టినట్లు అక్షరీకరించిన సాహిత్యకారుడు. నిరాడంబర జీవితం, లోతైన పరిశీలన ఆయన ప్రత్యేకత. ఏ వర్గంలో పుట్టితేనే తెలిసే అనుభవాలను, వారితో కలిసి జీవిస్తూ గ్రహించి రచనగా మలుస్తారు. అందుకే ఆయన కథల్లో కృత్రిమత కనిపించదు; జీవితం పలుకుతుంది.

చాకలి, మంగలి, కుమ్మరి, యానాది వంటి వర్గాల జీవన వాస్తవాలను గతంలో కథలుగా, నవలలుగా ఆవిష్కరించిన గోవిందు, ఇప్పుడు మాల–మాదిగ సమాజంలోని తోటి వ్యవస్థను, కాటి కాపరుల జీవితాలను కేంద్రంగా చేసుకుని ‘కాపరి’ నవలికను రచించారు. అగ్రకులాల ఆధిపత్యం, దౌర్జన్యం, దోపిడీ, హింసల మధ్య శతాబ్దాలుగా అణచివేతకు గురైన ఒక వర్గం జీవనగాథను ఈ రచన ఆవిష్కరిస్తుంది. ఆకలి, అవమానం, భూమిలేని జీవితం, సామాజిక వెలివేత వంటి కఠిన వాస్తవాలను ఎలాంటి ఆర్భాటం లేకుండా చిత్రిస్తూ, వారి మనుగడ వెనుక దాగి ఉన్న ఆత్మగౌరవ అన్వేషణను పాఠకుడి ముందుంచుతుంది. ​

మాల–మాదిగల మధ్య తరతరాలుగా ఏర్పడిన విభేదాలను అధిగమించి ఐక్యత వైపు సాగాల్సిన అవసరాన్ని ఈ నవల సూచిస్తుంది. అదే సమయంలో వారిని సేవలందించే వర్గంగా మాత్రమే చూసిన ఆధిపత్య దృక్పథాన్ని ప్రశ్నిస్తుంది. విద్య, రాజ్యాంగ హక్కులపై అవగాహన, సామాజిక చైతన్యంతో కొత్త తరం సాధిస్తున్న మార్పులను రచయిత ఆశావహంగా చిత్రించారు. పుట్టుక నుంచి మరణం వరకు గ్రామజీవితంలో కీలక పాత్ర పోషించినా గుర్తింపు లేకుండా జీవించిన తోటి వారి అస్తిత్వాన్ని ఈ రచన వెలుగులోకి తీసుకువస్తుంది. నేటి సమాజంలో రైతు కుటుంబాల పిల్లలు వ్యవసాయాన్ని కొత్త కోణంలో స్వీకరిస్తున్నట్లే, దళిత యువత కూడా విద్య, ఉద్యోగం, వ్యాపారం, పరిపాలన తదితర రంగాల్లో ముందుకు సాగుతోంది. ఒకప్పుడు కులవృత్తులుగా భావించిన పనులు నేడు అన్ని వర్గాలవారూ స్వీకరిస్తున్నారు. అలాగే దళితులు కూడా సంప్రదాయ వృత్తులకే పరిమితం కాకుండా గ్రామ సర్పంచుల నుంచి అత్యున్నత రాజ్యాంగ పదవుల వరకు ఎదుగుతున్నారు. ఈ సామాజిక పరిణామాలను రచయిత కథలో సహజంగా మేళవించారు.

కాపరులు అంటే కేవలం చాటింపులు చేసే వారు, డప్పులు మోగించే వారు, సమాధులు తవ్వే వారు అనే పరిమిత అభిప్రాయాన్ని ‘కాపరి’ చెదరగొడుతుంది. గ్రామ జీవితంలో అనేక బాధ్యతలు నిర్వర్తించినా గౌరవం దక్కని ఒక వర్గం మనుగడను, వారి నిశ్శబ్ద పోరాటాన్ని హృద్యంగా చిత్రిస్తుంది. అందుకే ఇది ఒక నవలిక మాత్రమే కాదు; విస్మృత జీవితాల చారిత్రక సాక్ష్యం. మనస్సాక్షిని తట్టి లేపే సాహిత్య రచన. సమాజ అంచుల్లో మిగిలిపోయిన మనుషుల అనుభవాలను ప్రధాన స్రవంతి చర్చలోకి తీసుకొచ్చే ప్రయత్నం. వివక్షలేని భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రతి పాఠకుడిని ఆత్మపరిశీలన వైపు నడిపించే శక్తి ఈ కృతికి ఉంది. ఆ అర్థంలో మూరిశెట్టి గోవిందు రచన సమకాలీన తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైన చేర్పుగా నిలుస్తుంది.

​- మల్లేశ్వరరావు ఆకుల

79818 72655

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్