తెలుగు గజల్ ప్రక్రియలో వ్యక్తిగత అనుభవాలను, కుటుంబ అనుబంధాలను, సాంస్కృతిక జ్ఞాపకాలను, కళా సాహిత్యాభిమానాన్ని ఒకే సంపుటిలో మేళవించిన రచనగా డాక్టర్ రమణ యశస్వి రచించిన “తేనెవిందు (యశస్వీయ గజల్ తేనియలు)” నిలుస్తుంది. నానీలు, న్యూమరిక్కులు, తిమ్మిరి బిళ్ళలు, కరోనా ఆత్మకథ, తులసీదళాలు, రెక్కల గుర్రం వంటి విభిన్న ప్రక్రియల్లో రచనలు చేసిన ఆయన ఈ సంపుటిలో గజల్ ప్రక్రియను ఆశ్రయించారు. ప్రేమ, కుటుంబం, జన్మభూమి, మాతృభాష, కళాకారులు, సామాజిక విలువలు వంటి అనేక అంశాలు ఇందులో కనిపించినా, వాటన్నింటినీ కలిపి ఉంచేది ఒకే భావసూత్రం- ఆత్మీయత.
తొలి గజల్ “తేనెవిందు” ప్రేమ, విరహం, అన్వేషణ, ప్రకృతి సౌందర్యాలను మేళవిస్తుంది. “నీ స్వర్గపు టంచులలో కలసి తినే తేనెవిందు / యశస్వీయ శిల్పమల్లే మలచి తేనెవిందు” అనే పంక్తుల్లో “తేనెవిందు” కేవలం మకుటం కాదు; అనుభూతిని మాధుర్యంగా చేసే ప్రతీక. అదే ధోరణి “ఎంకి బావ”, “గోపికేమొ”, “నీరూపమే” వంటి గజల్స్‌లో కనిపిస్తుంది. “కొరికి తినగా పూతరేకు పెట్టినాను ఎంకి బావ...” వంటి పంక్తుల్లో జానపద ప్రేమకావ్యాల సున్నితత్వం, “సిరి వెన్నెల వెదజల్లుతూ జడగంటల గోపికేమొ...”లో బాపు చిత్రాల్లోని తెలుగుదనం, సౌందర్య దృష్టి గుర్తుకు వస్తాయి. గోరింటాకు, జడగంటలు, ఎంకి–బావ వంటి ప్రతీకలు స్థానికతను, తెలుగు సంస్కృతితో అనుబంధాన్ని కల్పించాయి. ప్రేమ ఇక్కడ శృంగారానికే పరిమితం కాకుండా జ్ఞాపకం, ఆరాధన, మమకారం, సమర్పణగా విస్తరించింది.
కుటుంబ అనుబంధాలకు సంపుటిలో ప్రత్యేక స్థానం ఉంది. “ప్రసన్నమే”లో జీవిత భాగస్వామిని జీవన ప్రయాణంలో సహచరిగా, బాధ్యతలను పంచుకునే వ్యక్తిగా కవి చూస్తారు. “చిద్విలాస చిరునవ్వు కలసి మెలసి ప్రసన్నమే...” అనే పంక్తుల్లో కృతజ్ఞత, అనురాగం కనిపిస్తాయి. “రమణీయ”లో తల్లి పట్ల గౌరవం, మమకారం వ్యక్తమవుతాయి. అయితే కుటుంబ స్మృతిని ఆర్ద్రంగా పలికించేది “నాన్న” గజల్. “నీ చొక్కాలను ఉతకాలని ఉంది నాన్న / ప్రతిరోజూ తప్పకుండా కొలవాలని ఉంది నాన్న” అనే పంక్తులు తండ్రి జ్ఞాపకాన్ని సజీవ అనుబంధంగా నిలబెడతాయి. “అన్నమయ్య”లో అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని, కుటుంబ బంధాల పట్ల తన విశ్వాసాన్ని కవి వ్యక్తం చేస్తారు.
జన్మభూమిపై రాసిన “గణపవరము” గజల్ కూడా ఈ స్మృతి వలయంలో భాగమే. “ఊరంటే మా ఊరే జన్మమిచ్చే గణపవరము / తిరుగులేని సంస్కారపు సారమిచ్చె గణపవరము” అనే పంక్తుల్లో ఊరు భౌగోళిక ప్రదేశం మాత్రమే కాదు; వ్యక్తిత్వ నిర్మాణానికి పునాది. బాల్యం, సంస్కారం, ఎదుగుదల జన్మభూమితో ముడిపడి ఉంటాయని కవి చెబుతారు. వ్యక్తిగత స్మృతులను తనకే పరిమితం చేయకుండా, వాటిలో పాఠకుడు తన అనుభవాన్ని చూసుకునే అవకాశం కల్పించడం ఈ సంపుటి బలం.
కళా, సాహిత్య వ్యక్తుల పట్ల రచయితకు ఉన్న గౌరవం మరో ముఖ్యమైన ధోరణి. గాంధీ, బాపు, ముళ్లపూడి వెంకటరమణ, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి వ్యక్తులపై రాసిన గజల్స్ కేవలం ప్రశంసా గీతాలు కావు; వారి ప్రభావాన్ని గుర్తు చేస్తాయి. “బక్కెనలో బాపూజీ జీవితమే నిత్యసత్యం /టోపీ పెట్టు నేటి నేత స్వహితమే నిత్యసత్యం”లో గాంధీ జీవితం విలువల ప్రమాణంగా నిలుస్తూ, సమకాలీన రాజకీయాలపై సూక్ష్మ వ్యంగ్యాన్ని వ్యక్తం చేస్తుంది. బాపు–రమణల సృజనాత్మక భాగస్వామ్యం, సిరివెన్నెల సాహిత్య వారసత్వం కూడా కవి సాంస్కృతిక జ్ఞాపకాల్లో భాగమయ్యాయి. వైద్య వృత్తి, మాతృభాష, జీవన తాత్వికత వంటి అంశాలను కూడా గజల్ వస్తువులుగా స్వీకరించడం మరో ప్రత్యేకత. “వైద్య వృత్తి అంటేనే మానవత్వం ఉట్టిపడు / యశస్వీయ చేతలలో సేవాతత్వం ఉట్టిపడు” అనే పంక్తుల్లో వైద్యాన్ని ఉపాధిగా కాకుండా సేవగా చూడాలనే దృష్టి కనిపిస్తుంది. “ఇంగ్లీషు ఏబీసీలు నేర్వలేదు తెలుగు భాష...” వంటి పంక్తుల్లో మాతృభాష పట్ల మమకారం, భాషా గౌరవం వ్యక్తమవుతాయి. “టెంకాయ” వంటి సాధారణ వస్తువు చుట్టూ జీవితం, ఆశలు, భక్తి, ఆధ్యాత్మికతను అల్లడం ద్వారా సాధారణ దృశ్యాల్లోనూ కవిత్వాన్ని చూడగల స్వభావాన్ని కవి చూపించారు.
శిల్ప పరంగా మకుటాల వినియోగం ఈ సంపుటి ప్రధాన బలం. “తేనెవిందు”, “ఎంకి బావ”, “గజళ్ళోయి”, “వందనమ్ము”, “ఉంది నాన్న”, “ఉట్టిపడు”, “సిరివెన్నెల” వంటి మకుటాలు గజల్స్‌కు గుర్తింపునిస్తాయి. సంప్రదాయ గజల్ నిర్మాణాన్ని అనుసరిస్తూనే తెలుగు భాష సహజత్వాన్ని కాపాడారు. పాండిత్య ప్రదర్శన కంటే భావప్రకటనకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల గజల్స్ సాధారణ పాఠకునికీ చేరువవుతాయి. కొన్నిచోట్ల భావోద్వేగం శిల్పం కంటే ముందుకు వచ్చినా, సంపుటి మొత్తం మీద అనుభవ ప్రపంచాన్ని గజల్ రూపంలో మలచడంలో రమణ యశస్వి విజయవంతమయ్యారని చెప్పవచ్చు. ఇది కేవలం గజల్స్ సంకలనం కాదు; ఒక వ్యక్తి జీవితం, జ్ఞాపకాలు, అభిరుచులు, అనుబంధాలు, సాంస్కృతిక విలువల దినచర్య. వ్యక్తిగత అనుభవాన్ని పాఠకుడి అనుభవంగా మార్చిన చోట “తేనెవిందు” తన ప్రత్యేకతను చాటుకుంటుంది.
- పింగళి భాగ్యలక్ష్మి






కామెంట్‌లు (0)