విశ్వానికంతటికీ వెలుగును
సమదృష్టితో పంచవలసిన
సూర్యుడెందుకో
బొద్దింకలకేసి చుర చుర చూశాడు
బేటరీలు డౌన్ అయిపోయి
డల్లుగా మూలమూలల్లో
చీకట్లో సర్దుకోడానికి
తిప్పలు పడడంలో మునిగిన
బొద్దింకలకు
ఒక్కసారి చుర్రుమంది!
బేటరీలు చార్జ్ అయిపోయాయి
యాంటెన్నాలు నలుదిక్కులా
చురుగ్గా కదులుతున్నాయి
బొద్దింకల రొద జోరందుకుంది
బొద్దింకల ఘోషను, గాయాలను
కళ్లారా ఒక్కసారి చూడమని
న్యాయం కోసం వేడుకుంటే
చూడలేనని చెప్పి సూరీడు
కళ్లకు గంతలు కట్టేసుకున్నాడు
ఇన్నాళ్ల గంతలు న్యాయదేవతకేనని
అందరం అనుకుంటున్నాం
ఇప్పుడు న్యాయమూర్తులూ గాంధారులై పోతున్నారు
న్యాయానికి గ్రహణం పట్టింది!
- సుబ్రహ్మణ్యం







కామెంట్‌లు (0)