పల్లవి: స్వరాల ద్వారం మూసుకున్నది
మౌనపు తీరం చేరుకున్నది
ఎక్కడో చెప్పు విభావరి
చేరుకుంటాము సరాసరి జానకి.. జానకి
కోట్ల స్వరాలు పొదువుకున్న
వరదాయినివి నీవు
సంగీతమే సన్నిధానంగా
తుంబుర తంబురవైనావు
జానకి.. జానకి
ఓ జానకి.. జానకి
చరణం 1
పాట పాటకో కోట కట్టావు
వేల భావాలు దాచిపెట్టావు
పాటల అక్షయపాత్రవయ్యావు
నామమాత్రనని చెప్పుకున్నావు
జానకి.. ఓ జానకి
చరణం 2
భాష నీకెపుడూ వాహికయే
పాటకు నీవు నాయికవే
సంగీతార్చన మంత్రపుష్పమై
దిగంతాల ఆరాధనవే
జానకి.. ఓ జానకి
చరణం 3
నీకు పాడిన పాటలన్నీ
జీవనదులలో క్షీరధారలే
నవరసాలు నీ నవప్రాణాలై
సకల భువనాల స్వరపేటికలే
జానకి..... ఓ జానకి
చరణం 4
పలుకలేని పలుకే లేదని – నీ
పకపక సైతం పులకితమాయెను
విషాదమైనా ప్రమోదమైనా
స్వర తూణీరపు ధనుర్ధారివి
జానకి..... ఓ జానకి
చరణం 5
పాటకు నీవు రూపధారివి
మనోరంజక సంజీవనివి
సప్తస్వర పుంజానివి
సంధ్యా సుందర కెంజాయివి
జానకి..... ఓ జానకి
చరణం 6
పాడాల్సిది ఏమీ లేదని
నీ పాటలన్నీ చిరంజీవులని
నీ స్వరసంపద మాకిచ్చేసి
వినమ్రమైతివి విరాగినిలా
జానకి..... ఓ జానకి
– దేవేంద్ర






కామెంట్‌లు (0)