ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆంధ్రాలోనే ఓటు హక్కు ఇవ్వాలి

1 గంట క్రితం

sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 12:25 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సచివాలయం వద్ద గిరిజనుల ఆందోళన

- ఎన్యూమరేషన్‌ ‌ఫారాలు ఆమోదించాలని డిమాండ్‌

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : తమకు ఎపిలోనే ఓటు హక్కు కల్పించాలని, తమ ఎన్యూమరేషన్‌ ‌ఫారాలు ఆమోదించాలని కోరుతూ పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ పరిధిలోని కొత్తవలస గిరిజనులు ఆదివారం స్థానిక గ్రామ సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ‌విధుల్లో ఉన్న అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు. సిపిఎం ఆధ్వర్యాన ఈ కార్యక్రమం చేపట్టారు. దాదాపు పాతికేళ్ల క్రితం ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా పొట్టంగి మండలం పేటూరు, సుంకి పంచాయతీల పరిధిలోని గ్రామాల నుంచి గిరిజనులు జీవనోపాధి కోసం ఇక్కడకు వచ్చారు. అప్పటి నుంచి వీరు ఇక్కడే స్థిరనివాసం ఉంటున్నారు. వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివాస స్థలాలు, రేషన్ కార్డులు, ఓటు హక్కు, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలూ కల్పించింది. వారు ఇక్కడే ఓట్లు వేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ‌ప్రక్రియలో వారి ఓట్లు 2002 ఓటరు జాబితాతో మేపింగ్ కావడం లేదు. వారి పూర్వీకుల ఓట్లు ఒడిశాలో ఉన్నందున ఇక్కడ ఓటరు జాబితాలో కనిపించడం లేదు. దీంతో, మన రాష్ట్ర ఎన్యూమరేషన్ అధికారులు వారి ఓటరు నమోదు ఫారాలను తిరస్కరించారు.

ఈ నేపథ్యంలో గిరిజనులు తమ ఓటు హక్కు కోల్పోతామేమోనని భయాందోళనకు గురయ్యారు. తమ ఎన్యూమరేషన్ ఫారాలు ఆమోదించి తమకు ఆంధ్రాలోనే ఓటు హక్కు కల్పించాలని డిమాండ్‌ ‌చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కె గంగునాయుడు మాట్లాడుతూ ఇంకా రెండు రోజులే గడువు ఉన్నందున అధికారులు బేషరతుగా గిరిజనుల ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుని వారిని ఆంధ్రా ఓటరు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, ఐటిడిఎ పిఒ కల్పించుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. సిపిఎం మండల నాయకులు పాలమిట్ట రాము, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం పార్వతీపురం జిల్లా ఉపాధ్యక్షులు పి.రాము తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్