ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

‌రేపటితో ముగియనున్న ‘సర్‌’

1 గంట క్రితం

sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 12:09 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- 2002 జాబితాలో ఓట్లు

- వివరాలు లేక అవస్థలు

- 99.98 శాతం ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ

- డిజిటలైజేషన్‌ 
93.29 శాతమే

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ ‌ప్రకారం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ‌ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియపై చాలా మంది ఓటర్లకు కనీస అవగాహన కరువైంది. దీంతో అధిక సంఖ్యలో ఓటర్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే సర్‌ ‌ప్రక్రియ పూర్తి చేసిన పశ్చిమ బెంగాల్‌, కేరళం, తదితర రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించడంతో ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉంటాయో, లేదో తెలియని సందిగ్ధతలో కొట్టుమిట్టాడుతున్నారు. బూత్‌ ‌లెవల్‌ అధికారులు 99.98 శాతం గణన ఫారాలను ఓటర్లకు సమర్పించినట్లు ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది. గత నెల 15వ తేదీన ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఇప్పటి వరకూ మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు సంబంధించి 4,16,20,565 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు అధికారుల విడుదల చేసిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. గణన ఫారాలను పూర్తి చేసి బిఎల్‌ఒలకు ఓటర్లు సమర్పించినా చివరి సమగ్ర సవరణ జరిగిన 2002 ఓటర్ల జాబితాల్లో వారి పేర్లు కనిపించని పరిస్థితిని అనేక ప్రాంతాల్లో ఓటర్లు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సంఘం రూపొందించిన యాప్‌‌లో ఓటర్ల వివరాలను బిఎల్‌ఒలు నమోదు చేసి సర్చ్‌ ‌చేస్తున్నా పేర్లలో చిన్నపాటి మార్పులున్నా అంగీకరించకపోవడంతో ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగక బిఎల్‌ఒలు సైతం సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2002 ఓటర్ల జాబితాలు అందుబాటులో లేకపోవడంతో వారి వివరాలను పరిశీలించుకునేందుకు ఓటర్లకు అవకాశం లేకుండా పోయింది. 2002 ఓటర్ల జాబితాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పలు పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరినా ప్రయోజనం లేదు. ఆన్‌‌లైన్‌ ‌విధానంలో అవగాహన కలిగిన ఓటర్ల జాబితాలను పరిశీలించుకుంటుండ గా, సామాన్యులు మాత్రం బిఎల్‌ఒలు, కార్యాల యాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రక్రియ పొడిగింపునకు డిమాండ్‌

సర్‌ ‌ప్రక్రియ అనేక చోట్ల ఓటర్లకు ఫారాలు అందలేదని, 2002 జాబితాలో ఓట్ల వివరాలు కనిపించకపోవడం వంటి సమస్యలు అధికంగా ఉత్పన్నం కావడంతో ప్రక్రియను పూర్తి చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని రాజకీయ పార్టీలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. ఈ ప్రక్రియను మరో నెలరోజులు పొడిగించి, ఓటర్లకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని సిపిఎం కోరింది. గ్రామ, వార్డు స్థాయిల్లో సభలు నిర్వహించి ఓటరు లిస్టులు ప్రకటించడంతోపాటు ఓటర్లకు ఈ విధానంపై అవగాహన కలిగించాలని కోరింది. ప్రధాన ప్రతిపక్షం వైసిపి సర్‌ ‌గడువు పొడిగించాలని డిమాండ్‌ ‌చేస్తోంది. సిపిఐ, కాంగ్రెస్‌, ఇతర పార్టీలు సర్‌‌ను పొడిగించాలని కోరుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ అంశంపై ఎన్నికల సంఘం ఎటువంటి ప్రకటన చేయకపోవడం ఆందోళన కలిగించే అంశం.

డిజిటలీకరణలో అత్యల్ప స్థానంలో విశాఖపట్నం

ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లకు సంబంధించి 4,16,20,565 ఎన్యూమరేషన్ ఫారాలు ఇప్పటి వరకూ పంపిణీ చేయగా, ఓటర్లు అందజేసిన గణన ఫారాల్లో 3,88,34,360 ఫారాలు డిజిటలైజేషన్‌ ‌చేసి 93.29 శాతం పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో విశాఖపట్నం 87.24 శాతంలో చివరి స్థానంలో నిలవగా, 90 శాతం లోపు నమోదైన జిల్లాలుగా నంద్యాల 89.96 శాతం, ఎన్‌టిఆర్ 89.95 శాతం, విజయనగరం 89.89 శాతం, ప్రకాశం 89.60 శాతంలో ఉన్నాయి. ఈ నెల 14తో ప్రక్రియను ముగించి, ఈ నెల 21న డ్రాఫ్ట్‌ ‌రోల్‌ ‌విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

కొత్త ఓటర్లూ కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వాల్సిందే : ఇసి ​

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునే దరఖాస్తుదారులు కూడా తమ తల్లిదండ్రుల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) వివరాలను సమర్పించడం తప్పనిసరి అని ఎన్నికల సంఘం (ఇసి) తెలిపింది. గతంలో ఎస్‌ఐఆర్‌ పరిధిలోకి రాని ప్రస్తుత ఓటర్లు మాత్రమే కాకుండా, కొత్త దరఖాస్తుదారులు కూడా ఈ నిబంధనను పాటించాల్సిదేనని ఇసి స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ఓటర్ల జాబితాలో చేరడానికి ఫారం 6 నింపే కొత్త ఓటర్లు తమ తల్లిదండ్రుల ఎస్‌ఐఆర్‌ వివరాలను జతచేయడం తప్పనిసరి. ఈ నిబంధన గత ఏడాది జూన్‌లో ప్రారంభమైన బీహార్ ఎస్‌ఐఆర్‌‌లో చేర్చింది. కొత్త ఓటర్లు ఫారం 6తో పాటు ఈ డిక్లరేషన్‌ను సమర్పించాలి. ​​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్