ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కౌంట్‌డౌన్

1 గంట క్రితం

time
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 04:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మారినట్టు నటిస్తావు కానీ బాస్,
నువ్వెప్పటికీ మారలేవు
మార్పు లేకపోవటమే నీ జన్యులక్షణమైనప్పుడు
బుద్ధిలో మార్పొస్తుందనుకోవటం బుద్ధితక్కువతనమే!

ఇప్పుడు వినమ్రంగా గంట సమయం కోసం
ప్రాధేయపడుతున్న మనసు
నెలల తరబడి నిలిచిన జంతర్‌మంతర్‌ గొంతులకు
ఒక్క నిముషమైనా ఎందుకివ్వలేకపోయింది?

ఢిల్లీ సరిహద్దుల్లో, చలిలో, ఎండలో
కొడవలి చిహ్నాల్లా నిలబడ్డ దేశం వెన్నెముకలకు
మేకులు నాటటానికి ఇచ్చిన సమయం
మాటలు మీటటానికి ఎందుకివ్వలేకపోయారు?
మణిపూర్‌ అనాగరిక మంటల వేళ
ఆర్తిగా పిలిచిన ఆడబిడ్డలకు
ఒక్క భరోసా క్షణాన్నయినా ఏల ప్రసాదించలేకపోయారు!

అంకాలు అంకాలుగా సాగిన మీ బింకపు నాటకం
ఇక ముగింపుకొచ్చింది
ప్రశ్నలై పొంగుతున్న ఈ దేశపు స్వరంలో
మీ భవిష్యత్తు దృగ్గోచరమవుతోంది!

కళ్లు తెరిచినట్టు నటిస్తూ గొంతు మారిస్తే సరిపోతుందా బాస్‌?
ప్రశ్నల మీద మళ్లీ అవే అక్కసు ముద్రలు కక్కేశావు!
‘దిమాగ్‌ నక్సల్స్‌’ నామంతో మళ్లీ అదే ద్వేషపు దుర్గంధం
ప్రశ్నకు భయపడేవాడే
ప్రశ్నకు నల్ల ముసుగులు తొడగాలనుకుంటాడు

చల్‌ చల్‌... దేశం కళ్లు తెరచి చాలా కాలమైంది!
పురాతన వ్యూహాలు పురిట్లోనే సంధికొట్టే రోజులివి.
పొట్టి నిక్కరు పొడవు ప్యాంటు అయినంత ఈజీ కాదు
జెన్‌ తరం అంతరంగాన్ని అందిపుచ్చుకోవడం...

మారబోమని భీష్మించుకుని కూర్చుంటే
మార్చి తీరాల్సిన బాధ్యత మాదే అవుతుంది!
అంతవరకూ మీ గంటలు మీ దగ్గరే ఉంచుకొండి
జంతర్‌మంతర్‌లో గంట మోగడం మొదలై
చాలా గంటల సమయం గడిచింది!
– టీనా
97012 88788

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్