ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జాషువా సాహిత్యం - సమకాలీనత

57 నిమిషాల క్రితం

jashuva
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 04:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

కులం, మతం, ఆర్థిక అసమానతలు మనిషి జీవితాన్ని ఇప్పటికీ ప్రభావితం చేస్తున్న సమాజంలో గుఱ్ఱం జాషువా సాహిత్యం గతాన్ని గుర్తుచేసేది మాత్రమే కాదు.. వర్తమానాన్ని ప్రశ్నించే సజీవ స్వరం. అంటరానితనం, కులవివక్ష, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా జాషువా ఎక్కుపెట్టిన కలం, మానవ సమానత్వం కోసం ఆయన వినిపించిన గొంతు నేటికీ అంతే ప్రాసంగికంగా ఉన్నాయి. అందుకే నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువా సాహిత్యాన్ని మరోసారి లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 80వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నా దళితులపై దాడులు, కులవివక్ష, అంటరానితనం, మహిళలపై అత్యాచారాలు, మతోన్మాద చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కుల, మతతత్వాలు పెచ్చరిల్లుతున్నాయి. దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన తరగతులకు రక్షణగా ఉన్న భారత రాజ్యాంగానికి, దాని లౌకిక విలువలకు, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో సమాజాన్ని కుల, మతాల గీతలు దాటి చూడాలని పిలుపునిచ్చిన జాషువా సాహిత్యం మన ముందుకు ఒక ప్రశ్నను తీసుకువస్తుంది: మనిషిని మనిషిగా చూడగలిగే సమాజాన్ని మనం నిర్మించుకున్నామా? ఈ నేపథ్యంలో జాషువా సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేయడం, ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఆవశ్యకంగా మారింది.

జాషువా తన జీవితంలో కులవివక్షను, అంటరానితనాన్ని స్వయంగా ఎదుర్కొన్నారు. వాటికి వ్యతిరేకంగా జీవితాంతం తన కలాన్ని, గళాన్ని ఎక్కుపెట్టారు. జాషువా 1895 సెప్టెంబర్ 28న ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. 1971 జులై 24న మరణించారు. ఆయన తల్లిదండ్రులు వీరయ్య, లింగమాంబలది కులాంతర, మతాంతర వివాహం. ఈ కారణంగా వారి కుటుంబాలు నాటి సమాజం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వాటిని తట్టుకుని నిలబడ్డాయి. జాషువా క్రైస్తవ మిషనరీ పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించి అనేక ఒడిదుడుకుల మధ్య చదువును కొనసాగించారు. రహస్యంగా పురాణాలు, ఇతిహాసాలను అధ్యయనం చేయడం నాటి క్రైస్తవ మిషనరీల ఆగ్రహానికి కారణమైంది. అదే సమయంలో దళితులు పురాణాలను అధ్యయనం చేయడం నచ్చని హిందూ సాంప్రదాయవాదుల నుంచి కూడా ఆయన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. జాషువా జీవితాన్ని పరిశీలిస్తే ఆయన వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అనేక సామాజిక, సాంస్కృతిక పరిణామాలు కనిపిస్తాయి.

1915-16 ప్రాంతంలో రాజమండ్రి చేరిన జాషువా అక్కడ మూకీ చిత్రాలకు కథావాచకుడిగా పనిచేశారు. కొంతకాలం నాటకరంగంతోనూ అనుబంధం కొనసాగించారు. రాజమండ్రిలో కందుకూరి వీరేశిలింగం, చిలకమర్తి లక్ష్మీనరసింహంతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి సంస్కరణోద్యమ, జాతీయోద్యమ స్ఫూర్తి జాషువా సాహిత్యంలో కనిపిస్తుంది. రాజమండ్రిలో పనిచేసేటప్పుడు ఒక పంచె, చొక్కాతోనే నెలలు గడిపినట్లు తెలుస్తుంది. అనంతరం మిత్రుల సహకారంతో కోటిలింగాలలో ఎనిమిదిన్నర అణాల జీతానికి ఉపాధ్యాయునిగా చేరి దుర్భరమైన జీవితం కొనసాగించారు. తరువాత గుంటూరులోని లూథరన్ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో అధ్యాపకునిగా పనిచేశారు. బాపట్లలోనూ, 1942 వరకు వినుకొండలోనూ ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1942-45 మధ్య జాతీయ యుద్ధ ప్రచారక సంఘంలో ప్రచారకునిగా పనిచేశారు. 1957-59 మధ్య మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.

19వ శతాబ్దంలో దేశంలో సాగిన సంఘసంస్కరణోద్యమాల ప్రభావం జాషువాపై ఉంది. బ్రాహ్మణాధిపత్యం, సతీసహగమనం, మహిళలను విలాస వస్తువులుగా పరిగణించే దురాచారాలకు వ్యతిరేకంగా సాగిన సంస్కరణోద్యమాల ప్రభావం ఆయన రచనల్లో కనిపిస్తుంది. జాషువాపై గాంధీజీ ప్రభావం కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంటరానితనం, అస్పృశ్యతపై ఆయన సాహిత్యం తిరుగుబాటు స్వరాన్ని వినిపించింది. గాంధీ హత్య ఆయనను తీవ్రంగా కలచివేసింది. సంఘసంస్కర్త ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన ‘మాలపల్లి’ నవల ప్రభావం కూడా జాషువాపై ఉంది. అభ్యుదయ రచయితల సంఘం ప్రభావంతో పాటు రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచంలో చోటుచేసుకున్న మార్పులు, 1917లో సోవియట్‌లో, 1949లో చైనాలో వచ్చిన సామాజిక పరిణామాల ప్రభావం ఆయన రచనల్లో కనిపిస్తాయి. ఆయన రచనల్లో మార్క్సిస్టు భావజాలానికి దగ్గరగా ఉండే అంశాలు అనేకం కనిపిస్తాయి. దళితుల మధ్య ఉన్న అనైక్యత తొలగాలని, ఉపకులాల పేరుతో ఐక్యతను విచ్ఛిన్నం చేసుకోవడం సరికాదని జాషువా భావించారు. నేటి సమాజంలో అస్తిత్వవాద ఉద్యమాలు విస్తరిస్తూ, మనుషుల పేర్ల ముందు కుల గుర్తింపులు మరింత బలపడుతున్న సందర్భంలో జాషువా తనను తాను విశ్వనరునిగా ప్రకటించుకోవడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

‘‘కుల మతాలు గీచుకున్న గీతలజొచ్చి

పంజరాన గట్టువడను నేను

నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు

తరుగులేదు విశ్వనరుడను నేను’’ అని తనను తాను విశ్వనరునిగా ప్రకటించుకున్నారు. 1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జాషువాను గవర్నర్ నామినేట్ చేశారు. అదే ఏడాది ఆయన రచించిన ‘క్రీస్తు చరిత్ర’కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది. అదే ఏడాది భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. జాషువా సాహిత్యంలో కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలపై నిరసనతో పాటు మానవ సమానత్వం, విశ్వమానవ దృక్పథం కూడా ప్రధానంగా కనిపిస్తాయి. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో జాషువా సాహిత్యానికి ఉన్న ప్రాసంగికతను అర్థం చేసుకోవచ్చు.

27న జాషువా స్మారక సభ

గుంటూరులో గుఱ్ఱం జాషువా విజ్ఞాన కేంద్రం ఏర్పడి బహుముఖ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం సాహిత్యం, కళా రంగాల్లో విశిష్ట కృషి చేసిన ప్రముఖులను గుర్తించి వారికి పురస్కారాలు అందిస్తోంది. గతంలో కొలకలూరి ఇనాక్, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, పాటిబండ్ల ఆనందరావు, చంద్రబోస్, ఓల్గా, కత్తి పద్మారావు, పాపినేని శివశంకర్, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, గంటేడ గౌరునాయుడు, గుమ్మా సాంబశివరావు, తెలకపల్లి రవి తదితరులకు పురస్కారాలు అందించారు. ఈ ఏడాది సాహిత్య రంగంలో, ముఖ్యంగా జాషువా సాహిత్యంపై ఎనలేని కృషి చేసిన ప్రొఫెసర్ కొయి కోటేశ్వరరావుకు జాషువా కవితా పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభలో పలువురు కవులు, కళాకారులు, సాహితీ మిత్రులు పాల్గొంటారు. ప్రముఖ సాహితీవేత్త భూసరపల్లి వెంకటేశ్వర్లు, మాజీ శాసనమండలి సభ్యుడు కె.ఎస్. లక్ష్మణరావు ప్రధాన వక్తలుగా పాల్గొంటారు.


- పాశం రామారావు, మేనేజింగ్ ట్రస్టీ

గుఱ్ఱం జాషువా విజ్ఞాన కేంద్రం, గుంటూరు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్