సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉత్తరాంధ్ర కన్నీళ్లకు కవిత్వ స్వరం..

1 గంట క్రితం

కన్నీటి సంద్రం.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 05:36 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఉత్తరాంధ్రను చారిత్రక దృష్టితో కళింగాంధ్రగా పిలుస్తారు. ప్రకృతి వనరులు, సౌందర్యం పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంలో స్థానిక ప్రజలు మాత్రం జీవనోపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ వైరుధ్యాన్ని, ప్రాంతం ఎదుర్కొంటున్న వివక్షను గార రంగనాథం తన ‘కన్నీటి సంద్రం కళింగాంధ్ర’ కవితా సంపుటిలో ప్రశ్నించారు. “పుష్కలంగా వనరులుండీ / దేబిరించాల్సిన దుస్థితిని ప్రశ్నించలేని నేల / నిత్య కన్నీటి సంద్ర కళింగాంధ్ర” అంటూ ఉత్తరాంధ్ర ప్రజల జీవన వాస్తవాలను కవిత్వంలో వ్యక్తం చేశారు. గతంలో 2000 సంవత్సరం వరకు రాసిన కవితలను ‘కాలం కత్తి మొనమీద’ పేరుతో పుస్తకంగా వెలువరించారు. రాజాం రచయితల వేదిక ద్వారా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ పద్యం, వ్యాసం వంటి ప్రక్రియల్లో రచనలు చేశారు. దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత 2021 నుంచి మళ్లీ కవిత్వం రాయడం ప్రారంభించారు. ఆ కవితల నుంచి ఎంపిక చేసిన రచనలతో ప్రస్తుత సంపుటిని తీసుకొచ్చారు. డాక్టర్ శిఖామణి రాసిన ‘ఉత్తరాంధ్ర అస్తిత్వ పతాక’ ముందుమాటతో పాటు ఇందులో సుమారు 70 కవితలు ఉన్నాయి.

కరోనా, గాజా యుద్ధం, ఢిల్లీ రైతు ఉద్యమం, నవరత్నాల అమ్మకం, మణిపూర్‌లో మహిళలపై దాడులు, రెజ్లింగ్ క్రీడాకారులపై జరిగిన పరిణామాలు, భారత్ జోడో యాత్ర వంటి దేశీయ, అంతర్జాతీయ ఘటనలపై కవి తన రాజకీయ, సామాజిక దృక్పథంతో స్పందించారు. వాటిని కేవలం నమోదు చేయకుండా, వెనుక ఉన్న అధికార ధోరణులను, సామాజిక వైరుధ్యాలను ప్రశ్నించారు. వ్యక్తిగత అనుభవాలనూ కవిత్వంలో భాగం చేశారు. “లోకాన్ని చూడగలిగే దృష్టి నాలో / చిక్కబడక ముందే / లోకాన్ని విడిచిపోయింది అమ్మ..” అంటూ తల్లి జ్ఞాపకాన్ని ‘రెప్పల చివరన చెమ్మ’ కవితలో అక్షరబద్ధం చేశారు. “అమ్మ అందరికీ ప్రపంచ అద్భుతం / నాకు మాత్రం అగమ్య గోచరం” అనే పంక్తుల్లో తల్లిని కోల్పోయిన అనుభూతిని వ్యక్తం చేశారు. సామాజిక అంశాలపై ఆగ్రహంతో స్పందించే కవిలోని వ్యక్తిగత విషాద కోణం ఈ కవితలో కనిపిస్తుంది.

ఉపాధ్యాయుడిగా పనిచేసిన రంగనాథం విద్యా వ్యవస్థలో సామాజిక బాధ్యతకు ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనతో పాటు సమాజాన్ని అర్థం చేసుకునే దృష్టిని కల్పించాల్సిన అవసరాన్ని ‘శిష్యా నన్ను మన్నించు’ కవితలో ప్రస్తావించారు. “విజ్ఞానం, ఆధ్యాత్మికత వైరి శిబిరాలనే జ్ఞానాన్ని / నీ తరానికి ఎక్కించలేని పిరికివాడు” అంటూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించలేని ఉపాధ్యాయుడి వైఫల్యాన్ని ఎత్తిచూపారు. పుట్టుక ఆధారంగా మనుషులను ఉన్నత, అల్ప వర్గాలుగా విభజించే భావనలను ప్రశ్నిస్తూ, మానవులందరూ సమానులనే అవగాహన కల్పించడం విద్యలో భాగం కావాలని సూచించారు. ‘చదువుల సంతలు’ కవితలో విద్యా వ్యాపారాన్ని విమర్శించారు. “ఎలుగెత్తి కూయలేని అస్వతంత్ర / సమాజాన్ని నడపలేడు / సొంతంగా నడవలేడు / నడివీధిన ఫారం కోడి” అంటూ స్వతంత్రంగా ఆలోచించలేని స్థితిని ప్రశ్నించారు. “విద్య సంత సరుకు కావడం / అధునాతన దౌర్భాగ్యం” అనే పంక్తుల ద్వారా విద్య కార్పొరేట్ వ్యాపారంగా మారడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ముంగిట్లో వెలుగు’, ‘పుస్తకాల పురుగు’, ‘కాలాతీతుడు’ కవితల్లో పుస్తక పఠనం, గ్రంథాలయాలు, జ్ఞాన విస్తరణ ఆవశ్యకతను ప్రస్తావించారు.

వర్ణ వ్యవస్థ, కుల వివక్ష, అణగారిన వర్గాల మధ్య ఐక్యత వంటి అంశాలనూ కవి ప్రస్తావించారు. అణచివేతకు గురవుతున్న వర్గాలే తమను అణచివేసే శక్తులను ఆరాధించే పరిస్థితిని “పైన కూర్చుంది కిందకు అణుస్తున్న పాదాలే / అణగారిన వర్గాలకు ఆరాధ్యాలు” అంటూ ‘తలకిందుల సమాజం’ కవితలో ప్రశ్నించారు. ఈ పరిస్థితి మారాలంటే అణగారిన వర్గాల్లో చైతన్యం, ఐక్యత అవసరమని సూచించారు. మహిళల పట్ల సమాజం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరినీ ప్రశ్నించారు. మతం, ఆధ్యాత్మికత పేరుతో ప్రజలను మోసం చేసే వ్యక్తులతో పాటు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న మనువాద భావజాలంపైనా విమర్శలు సంధించారు. జీవులు తమ పరిధిలో పరోపకారంగా బతుకుతుంటే, కొందరు బాబాలు సన్యాసం ముసుగులో పేదల శ్రమను దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. “ప్రపంచమంతా అభివృద్ధిలో రాకెట్లా / ముందుకు దూసుకుపోతున్నా.. / ఈ దేశాన్ని మధ్యయుగాల్లోకి తొయ్యడమే మా లక్ష్యం..” అంటూ దేశాన్ని వెనక్కి నడిపించే రాజకీయ ధోరణులను విమర్శించారు.

సామాజిక, రాజకీయ అంశాలతో పాటు ప్రకృతి, గ్రామీణ జీవితం కూడా ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి. ‘మొయిలు మంత్రగత్తె’ కవితలో వర్షాన్ని, ‘నిశి రాత్రి గూటిపిట్ట’, ‘రాగం తెగిన పద్యం’ కవితల్లో పల్లెటూరి వాతావరణాన్ని కవిత్వీకరించారు. ‘ఉత్కంఠ భరిత ఉత్కళ చిలక’ అనే దీర్ఘ కవితలో చిలకా సరస్సును వర్ణించారు. ‘లిప్త’ కవితలో సమయ ప్రాధాన్యతను ప్రస్తావించగా, ‘విస్ఫోటిస్తేనే’ కవితలో సాహసం, మార్పు ఆవశ్యకతను వివరించారు. తెలుగు ఉపాధ్యాయుడిగా ప్రాచీన సాహిత్యంతో పరిచయం ఉండటంతో పురాణ ప్రతీకలను సమకాలీన అంశాలకు అన్వయించారు. కార్పొరేట్ పాఠశాలల తీరును బలి చక్రవర్తి ప్రతీకతో, అరణ్యాలకు సంబంధించిన అంశాలను తాటకి వంటి పురాణ పాత్రలతో పోల్చి కొత్త అర్థాలను ఆపాదించే ప్రయత్నం చేశారు. ‘కన్నీటి సంద్రం కళింగాంధ్ర’లో ప్రాంతీయ అస్తిత్వం, విద్య, కుల వివక్ష, మహిళలపై హింస, మతం పేరుతో జరిగే మోసాలు, రాజకీయ పరిణామాలు ప్రధానాంశాలుగా నిలిచాయి. సామాజిక ఆగ్రహం ఈ సంపుటిలోని అనేక కవితలకు ప్రధాన స్వరం.

ప్రతులకు: 98857 58123

- ఆల్తి మోహనరావు, 99638 95636

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్