సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసంక్షుభిత ప్రతీక ‘ప్రతీక్ష’..

1 గంట క్రితం

ChatGPT Image Oct 10, 2026, 06_23_49 PM(2).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 05:14 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

కవిత్వం అనేది కవి చూసిన ప్రపంచాన్ని యథాతథంగా చూపించే అద్దం కాదు; అతని అంతరంగంలో ఆ ప్రపంచం కలిగించిన ప్రకంపనలకు రూపం. దేశరాజు ‘ప్రతీక్ష’ కవితా సంపుటిని అందుకే ఒక వ్యక్తి భావోద్వేగాల సంకలనం అనడం కంటే ఒక కాలాన్ని, దాని మనుషులను, వారి ఆశలు, ఆవేదనలను నమోదు చేసిన కవితా దస్తావేజుగా అనడం సబబు. ప్రతీక్ష సంపుటిలో 2020-2026 మధ్య రాసిన 71 కవితలు ఉన్నాయి. దేశరాజు కవిత్వానికి మూలం అనుభూతి. కవిత్వం శక్తిమంతమైన భావాల సహజ ప్రవాహం కనుక దేశరాజు కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒడ్డున నిలబడి సముద్ర ఘోషను వినడమే! దేశరాజులో ఆవేశం ఉంటుంది; కానీ అది కేవలం నినాదంగా బయటపడదు. అనుభవం గుండా ప్రయాణించి కవితగా మారుతుంది. ఈ సంపుటి శీర్షిక ‘ప్రతీక్ష’నే తీసుకుంటే ఎదురు చూడటం అంటే ఎవరో రావడం కోసం వేచి ఉండటం మాత్రమే కాదు. ఒక మంచి సమాజం కోసం, మానవత్వం తిరిగి నిలబడటం కోసం, అన్యాయానికి ముగింపు కోసం, మనిషిలోని మనిషి మేల్కొనే క్షణం కోసం ఎదురు చూడటమూ ప్రతీక్షే. అందుకే ఈ పేరు మొత్తం సంపుటికి అంతర్లీనమైన మానసిక స్థితిగా నిర్ధారించవచ్చు.

​‘విరిగిపోయిన ఇంద్రధనస్సు’ వంటి కవితా సందర్భం దేశరాజు ప్రతీకాత్మకతను చాటుతుంది. ఇంద్రధనస్సు సాధారణంగా రంగులు, ఆశ, అందానికి సంకేతం. అది ‘విరిగిపోయింది’ అనగానే ఆ అందం వెనుక దాగిన విధ్వంసం, భంగమైన కల, ఛిన్నాభిన్నమైన ఆశ పాఠకుడి ముందు నిలుస్తాయి. ఒక సాధారణ దృశ్యాన్ని తీసుకుని దాని వెనుక ఉన్న మానసిక లేదా సామాజిక సత్యాన్ని వెలికి తీయడం దేశరాజు కవిత్వ పద్ధతి. అదే విధంగా ‘ఒక సాయంకాల స్వప్నం’ వంటి శీర్షికలో ‘సాయంకాలం’ ఒక కాలసంధికి, ‘స్వప్నం’ ఆశకు ప్రతీకలుగా నిలుస్తాయి. పగలు ముగిసి రాత్రి మొదలయ్యే మధ్యంతర స్థితిలాగే, మనిషి జీవితంలోనూ ఒక ముగింపు, మరో ఆరంభం మధ్య ఉండే అస్థిరతను కవి పట్టుకోవాలనుకున్నట్లు అనిపిస్తుంది. దేశరాజు కవిత్వానికి మరో ముఖ్యమైన నేపథ్యం తెలంగాణ సమాజం, ప్రజా ఉద్యమాలు, నగర జీవితం, సామాన్యుల అనుభవాలు. గత సంపుటి ‘దుర్గాపురం రోడ్’లో తన ప్రజా జీవితంలోని వైరుధ్యాలను, తెలంగాణ ఉద్యమ అనుభవాలను తనదైన దృష్టితో పలికించిన కవిగా గుర్తించబడ్డాడు. ఈ అనుభవం ‘ప్రతీక్ష’లో కేవలం రాజకీయ ప్రకటనగా కాకుండా మానవ అనుభవంగా రూపాంతరం చెందడం ప్రత్యేకత. ‘దుర్గాపురం రోడ్’ అనే కవితా ప్రపంచ దృక్పథం నుంచి ‘ప్రతీక్ష’కు వచ్చిన దృక్పథ పరిణామం ఈ కవితల్లో కనిపిస్తుంది. రోడ్డు అంటే ప్రయాణం; ప్రతీక్ష అంటే ఆ ప్రయాణంలో ఒక క్షణం ఆగి ఎదురు చూడటం. ఒకటి కదలికకు ప్రతీక అయితే మరొకటి ఆత్మపరిశీలనకు ప్రతీకగా నిలుస్తాయి.

​దేశరాజు భాషలో మరో ఆకర్షణీయమైన అంశం సరళతలోని నిగూఢత. ఆయన క్లిష్టమైన పదజాలంతో కవిత్వాన్ని భారంగా చేయకుండా, రోజువారీ జీవితంలో కనిపించే వస్తువులు, మనుషులు, దృశ్యాలనే ప్రతీకలుగా మార్చుకుంటారు. అందుకే పైకి చదివితే సులభంగా అనిపించే పంక్తి, మళ్లీ చదివినప్పుడు ఆధునిక జీవితం, మానవ సంబంధాలు, విషాదాలను సరళమైన శైలిలో వ్యక్తీకరించే కవిగా దేశరాజు నిలుస్తున్నాడు. అయితే ‘ప్రతీక్ష’లో కేవలం సామాజిక కవిత్వమే లేదు. ఇందులో వ్యక్తిగత జ్ఞాపకాలు, మానవీయ సంబంధాల వెచ్చదనం, ఏకాంతం, ప్రేమ, కాలం, ఆశాభంగం కూడా ఉన్నాయి. అందువల్ల కవి బయట ప్రపంచాన్ని ప్రశ్నిస్తూనే తనలోకి కూడా తొంగి చూసుకుంటున్నాడని అర్థమవుతుంది. ఆ అంతర్ముఖతే ఈ సంపుటికి మానవీయ స్వరాన్ని ఇస్తోంది.

​ఈ ‘ప్రతీక్ష’ కేవలం కవిదే కాదు-ఒక సమాజానిది కూడాను. ‘విరిగిపోయిన ఇంద్రధనస్సు’లో భంగమైన ఆశ కనిపిస్తే, ‘ఒక్కొక్క సాయంకాల స్వప్నం’లో ఇంకా మిగిలిన ఆశ కనిపిస్తుంది; ‘దుర్గాపురం రోడ్’లో ప్రయాణం కనిపిస్తే, ‘ప్రతీక్ష’లో ఆ ప్రయాణానికి అర్థం కోసం వెతుకులాట కనిపిస్తుంది. ఈ విభిన్న అనుభూతులను కలిపే దారం మనిషి పట్ల కవికి ఉన్న నమ్మకం. అందుకే దేశరాజు ‘ప్రతీక్ష’ను చదివిన తరువాత పాఠకుడిలో మిగిలేది-ఆ కవిత్వ పంక్తుల ఉటంకింపులో, ఆ కవితల ముగింపులో కాదు-చదివిన ప్రతి పాఠకునిలో మరొక ప్రశ్నకు, మరొక ఉదయానికి, మరొక మానవీయ అవకాశానికి మొదలయ్యే ఎదురుచూపు. దేశరాజు కథకుడిగానే స్థిరపడిపోకుండా కవిగా నిలవాలనే ప్రతీక్షకు ‘ప్రతీక్ష’ ఒక ఫలప్రద భరోసా!

- సుధామ, 98492 97958


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్