సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరాయలసీమ బతుకు చిత్రాలు

8 గంటల క్రితం

రాయలసీమ బతుకు చిత్రాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 05:51 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

తెలుగు దళిత, బహుజన, గ్రామీణ రైతాంగ జీవితాల్లోని వేదనలను రాయలసీమ మట్టి పరిమళం వెదజల్లే మాండలిక భాషలో సహజమైన వాస్తవికతతో అక్షరబద్ధం చేస్తున్న రచయిత కెంగార మోహన్. ‘కవనసేద్యం’, ‘నీళ్ళంకని నేల’, ‘చెమట చెక్కిన వాక్యం’ వంటి రచనలు చేశారు. అణగారిన వర్గాల జీవిత పోరాటాలను చిత్రించిన ఆయన కథా సంపుటి ‘బ్లాక్ రెయిన్ బో’ సమకాలీన తెలుగు దళిత, బహుజన కథా సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. ఈ సంపుటిలోని ‘భాగ్యమ్మ’, ‘ఊరిదేవర’, ‘వాన మెతుకులు..’, ‘మట్టిమనిషి...’, ‘నీ కృప నాకు చాలును..’, ‘వసంతం’, ‘సమిధలు’ వంటి కథలు రాయలసీమ సమాజంలోని వ్యవసాయ సంక్షోభం, వలసలు, ఫ్యాక్షన్ హింస, కులవివక్ష, భూకబ్జాలు వంటి సమస్యలను ఆవిష్కరిస్తాయి. ప్రకృతి సృష్టించిన కరవుతోపాటు మనుషులు నిర్మించిన కుల, వర్గ అసమానతల మధ్య సామాన్యులు ఎలా నలిగిపోతున్నారో తెలియజేస్తాయి.

​‘భాగ్యమ్మ’ కథలో కొడుకు ఉన్నత చదువుల కోసం జయరాజు, భాగ్యమ్మ దంపతులు తమ ఇంటిని సైతం అమ్ముకుంటారు. అమెరికా వెళ్లిన కొడుకు కుటుంబ బాధ్యతలను విస్మరించడంతో వారి త్యాగం విషాదంగా మారుతుంది. ఉన్నత విద్య వ్యక్తిగత ఎదుగుదలకు దోహదపడినా, కుటుంబం పట్ల బాధ్యతను పెంచకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ కథ చూపిస్తుంది. విద్య ద్వారా ఎదిగినవారు తమ మూలాలను, తమ కోసం త్యాగం చేసినవారిని విస్మరించకూడదనే సందేశం ఇందులో కనిపిస్తుంది. ‘ఊరిదేవర’ కథలో ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల దళిత, బీసీ కుటుంబాలు బలిపశువులవుతున్న తీరును రచయిత చిత్రించారు. హత్య కేసులో యువకులు జైలు పాలైన తర్వాత వారి కుటుంబాల్లోని మహిళలు పెత్తందార్ల వేధింపులకు గురవుతారు. తన కూతురికి కూడా అలాంటి ముప్పు ఎదురవుతుందనే భయంతో నీలమ్మ చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న నిస్సహాయత గ్రామీణ సమాజంలోని అధికార సంబంధాలను, మహిళల అభద్రతను వెల్లడిస్తుంది. వ్యవసాయ సంక్షోభం గ్రామీణ కుటుంబాల భవిష్యత్తును ఎలా దెబ్బతీస్తుందో ‘వాన మెతుకులు..’, ‘మట్టిమనిషి...’ కథలు వివరిస్తాయి. ‘వాన మెతుకులు..’ కథలో పంట నష్టాలు, నకిలీ విత్తనాలు, నీటి పంపిణీలో అసమానతలు, మార్కెట్ దోపిడీ రైతులను అప్పుల ఊబిలోకి నెడతాయి. ఫలితంగా చదువుకోవాల్సిన వయసులోనే హారిక వ్యవసాయ కూలీగా మారుతుంది. బతుకుదెరువు కోసం కుటుంబం వలసబాట పట్టాల్సి వస్తుంది. కరవు పంటలకే పరిమితం కాకుండా పిల్లల చదువులను, కుటుంబాల భవిష్యత్తును కూడా దెబ్బతీస్తుందని ఈ కథ చెబుతుంది.

​‘మట్టిమనిషి...’ కథలో భూమిని కన్నతల్లిగా భావించే గాది లింగప్ప వ్యవసాయాన్ని వదులుకోలేక అప్పులపాలవుతాడు. బి.టెక్ చదివిన కొడుకుకు ఉద్యోగం దొరకక కూలీ పనుల కోసం వెళ్లాల్సి రావడం అతడిని కుంగదీస్తుంది. చివరకు గుండెపోటుతో మరణిస్తాడు. భూమిని అమ్ముకుని ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉన్నప్పటికీ దానిని వదులుకోలేని రైతు మనస్తత్వాన్ని, వ్యవసాయ సంక్షోభం చిన్నకారు రైతుల జీవితాలపై చూపే ప్రభావాన్ని ఈ కథ ప్రతిబింబిస్తుంది. అధికార వ్యవస్థలోని అవినీతి, రాజకీయ జోక్యం, సామాజిక వైరుధ్యాలను ‘నీ కృప నాకు చాలును..’ కథ విశ్లేషిస్తుంది. నిబంధనల ప్రకారం పేద రైతులకే రుణాలు ఇవ్వాలని పట్టుబట్టిన ఈశ్వరప్ప తప్పుడు రికార్డులపై సంతకాలు చేయడానికి నిరాకరించి సస్పెండ్ అవుతాడు. మరోవైపు రిజర్వేషన్ల ద్వారా ఉన్నతాధికారిగా ఎదిగిన సువార్తమ్మ అక్రమాస్తుల కేసులో చిక్కుకుంటుంది. నిజాయితీకి కట్టుబడిన వ్యక్తి ఎదుర్కొనే కష్టాలను, అధికారం కోసం విలువలను వదులుకునే వ్యక్తుల వైఖరిని ఎదురెదురుగా నిలబెట్టి రచయిత నైతిక వైరుధ్యాలను ఆవిష్కరించారు. మతం మారినా కులవివక్ష కొనసాగుతుందనే వాస్తవాన్ని ‘వసంతం’ కథ ప్రశ్నిస్తుంది. క్రైస్తవ మతంలోకి మారిన కురువలు, మాదిగల మధ్య చర్చిల విషయంలోనూ కుల అంతరాలు కొనసాగుతాయి. మాదిగ యువకుడు మనోహర్, కురువ యువతి వసంత ప్రేమను కుల పెద్దలు వ్యతిరేకిస్తారు. కుటుంబానికి ముప్పు వాటిల్లకూడదనే భయంతో మనోహర్ ఆత్మహత్య చేసుకుంటాడు. మతబోధనలు మనుషుల ఆలోచనలను మార్చలేకపోతే వాటి సామాజిక ప్రయోజనం ఏమిటనే ప్రశ్నను ఈ కథ పాఠకుల ముందుంచుతుంది. భూకబ్జాలు, రాజకీయ కుట్రలు, కులాధిపత్యం కలిసి అట్టడుగు వర్గాల జీవితాలను ఎలా బలితీసుకుంటాయో ‘సమిధలు’ కథలో కనిపిస్తుంది. విలువ పెరిగిన భూమిని కబ్జా చేయడానికి పరమేశ్వరరెడ్డి దళిత, బహుజనులను పావులుగా ఉపయోగించుకుంటాడు. ఘర్షణలో అంజినప్ప, అతని అల్లుడు హత్యకు గురవుతారు. అసలు కుట్రదారు తప్పించుకోగా, బడుగు వర్గాలకు చెందినవారు హత్యలకు బలై జైలుపాలవుతారు. తండ్రిని కోల్పోయిన బాలుడు కెమెరా వైపు అమాయకంగా చూడటంతో కథ ముగుస్తుంది.

ఈ కథల్లోని పాత్రలు సామాజిక వాస్తవాలకు ప్రతిరూపాలుగా నిలుస్తాయి. వ్యక్తుల స్వభావాలను మాత్రమే కాకుండా, వాటిని ప్రభావితం చేసే సామాజిక పరిస్థితులను కూడా రచయిత విశ్లేషించారు. ఈ కథలకు భాష ప్రధాన బలం. కర్నూలు, పశ్చిమ రాయలసీమ ప్రాంతాల మాండలిక నుడికారం కథా వాతావరణానికి సహజత్వాన్ని అందిస్తుంది. ‘సేద్యం’, ‘సుగ్గి’, ‘ద్యావర’, ‘బయానా’, ‘నా బట్ట’ వంటి ప్రాంతీయ పదాలు స్థానిక జీవన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. పాత్రల సామాజిక నేపథ్యానికి అనుగుణంగా సంభాషణలు సాగుతాయి. భాషను కథ చెప్పే సాధనంగా మాత్రమే కాకుండా, ప్రాంతీయ జీవనానుభవాలను ఆవిష్కరించే మాధ్యమంగా రచయిత ఉపయోగించారు. కథన శిల్పంలోనూ ఆధునిక పద్ధతులను సమర్థవంతంగా ఉపయోగించారు. ‘సమిధలు’ కథలో సంఘటనలను క్రమంగా విప్పుతూ అసలు కుట్రను బయటపెట్టడం, ‘నీ కృప నాకు చాలును..’ కథలో అవినీతికి పాల్పడిన అధికారిణి జీవితాన్ని, నిజాయితీపరుడైన ఉద్యోగి పరిస్థితిని సమాంతరంగా చిత్రించడం కథనానికి ప్రత్యేకతను ఇస్తాయి. సామాజిక, తాత్విక కోణాల్లో ఈ కథలు అణచివేతను మాత్రమే కాకుండా దళిత, బహుజన సమాజంలోని అంతర్గత వైరుధ్యాలను కూడా పరిశీలిస్తాయి.

అయితే, ఈ కథల్లో శిల్పపరంగా మరింత మెరుగుదలకు అవకాశం ఉంది. కొన్ని చోట్ల పాత్రల అంతర్మథనం, మానసిక సంఘర్షణల కంటే బాహ్య సంఘటనలకు ఎక్కువ ప్రాధాన్యం లభించినట్లు అనిపిస్తుంది. ‘సమిధలు’, ‘వసంతం’ వంటి కథల్లో విషాదాంతాలతోపాటు పాత్రల్లో పుట్టే ప్రతిఘటనను, మార్పు కోసం వారు చేసే ప్రయత్నాలను కూడా లోతుగా చిత్రిస్తే కథల ప్రభావం మరింత పెరిగేది. సామాజిక సిద్ధాంతాలను నేరుగా సంభాషణల్లో చెప్పడం కంటే పాత్రల ప్రవర్తన, సంఘటనల పరిణామాల ద్వారా సహజంగా వ్యక్తం చేస్తే కథనం మరింత సున్నితంగా సాగేది. అలాగే, కొన్ని ప్రాంతీయ పదాలకు సందర్భానుసారమైన వివరణలు అందిస్తే ఇతర ప్రాంతాల పాఠకులకు కూడా కథలు మరింత చేరువవుతాయి. ఈ పరిమితులు కథల సామాజిక ప్రాధాన్యాన్ని తగ్గించవు. సమకాలీన తెలుగు దళిత, బహుజన కథా సాహిత్యంలో ఈ సంపుటి ఒక ముఖ్యమైన చేర్పు.

​- డాక్టర్ సుంకర గోపాల్

85559 71630


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్