రిగ్గింగ్ జరిగిన ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలి : వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి-విజయవాడ: రాష్ట్రంలో నేడు జరిగిన కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడి పలు ప్రాంతాల్లో బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌కు పాల్పడటాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. రిగ్గింగ్ జరిగిన ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు.
రాయలసీమ జిల్లాల్లో అధికార పార్టీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించడం గర్హనీయమని ఆయన పేర్కొన్నారు. నంద్యాల జిల్లా డోన్ మున్సిపాలిటీలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన భార్య సుజాతమ్మ నాయకత్వంలో వందలాది మందితో 36 వార్డులను ఆక్రమించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. సిపిఎం పోటీ చేస్తున్న 15, 18, 28 వార్డుల్లో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఇతర పోలీసుల సహకారంతో సిపిఎం, వైసీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించి, ఒక ప్రాంతంలో నిర్బంధించి పూర్తిస్థాయిలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని తెలిపారు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీలో సిపిఎం పోటీ చేస్తున్న 22వ వార్డులో తెలుగుదేశం కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలోనూ సుమారు 15 వార్డుల్లో ఇదే తరహా అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. గిద్దలూరు, బేతంచెర్ల మున్సిపాలిటీల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మార్కాపురం జిల్లా కనిగిరిలో 29వ వార్డు నుంచి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి కేశవరావును రౌడీషీట్ ఉందనే కారణంతో పోలింగ్ ముగిసే వరకు పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారని విమర్శించారు. కడప జిల్లాలోని పులివెందుల, అనంతపురం జిల్లాల్లోనూ రిగ్గింగ్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయని తెలిపారు.
అధికార పార్టీ పథకం ప్రకారం అక్రమాలకు పాల్పడుతుంటే వాటిని అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం అందుకు విరుద్ధంగా వారికి సహకరించడం దుర్మార్గమని వి.శ్రీనివాసరావు విమర్శించారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించి, ఆయా ప్రాంతాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. రిగ్గింగ్‌కు సహకరించిన పోలీసు, పోలింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.







కామెంట్లు (0)