ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పట్టుకునే యత్నంలో ఆరు రౌండ్లు కాల్పులు
తీవ్రంగా గాయపడిన హేమంత్
ప్రజాశక్తి-అనంతపురం :అనంతపురం జిల్లా రాప్తాడులోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో నిందితుడు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు యత్నించడంతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో హేమంత్ తీవ్రంగా గాయపడటంతో అతడిని అనంతపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రాప్తాడులోని జడ్పీ ఉన్నత పాఠశాలలోకి చొరబడిన హేమంత్.. పదో తరగతి చదువుతున్న గోపికపై ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. రాప్తాడు మండలం అయ్యవారిపల్లికి చెందిన గోపిక తరగతి గదిలో ఉండగా, హేమంత్ ఒక్కసారిగా రంపంతో లోపలికి ప్రవేశించి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో అదే తరగతికి చెందిన లక్ష్మి అనే విద్యార్థిని ధైర్యంగా నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె రెండు కాళ్లకూ తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థుల కేకలతో నిందితుడు రంపాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలికతో పాటు గాయపడిన లక్ష్మిని స్థానికులు వెంటనే అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








కామెంట్‌లు (0)