సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు తమ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఆయన అభివర్ణించారు. ప్రజలు తమ పాలనను మెచ్చి, ప్రభుత్వ పనితీరుకు మద్దతుగా ఈ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్‌కే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రాజకీయాల కంటే ప్రజా సమస్యల పరిష్కారమే తనకు ముఖ్యమని చెప్పారు. కులాలు, మతాలు, తమకు ఓటు వేయని వారనే భేదాలు తమ ప్రభుత్వానికి లేవని ప్రజలు మెచ్చే పాలన అందిస్తూ, వారి సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని వివరించారు.
ఈ విజయాలు ప్రజల విశ్వాసానికి నిదర్శనం : పవన్
మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి లభించిన విజయాలు ప్రభుత్వ పాలనపై పట్టణ ప్రజల విశ్వాసానికి నిదర్శనమని జనసేన అధినేత, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ తెలిపారు. ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోడీ సహకారం, సిఎం చంద్రబాబు అనుభవంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.







కామెంట్లు (0)