* 15 మంది చిన్నారులు సహా 33 మందిని రక్షించిన పోలీసులు
బుర్హాన్‌పూర్ (మధ్యప్రదేశ్) : చెరుకు కోత పనుల కోసం పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు వెళ్లి, అక్కడ వెట్టిచాకిరీ బారిన పడ్డ 15 మంది చిన్నారులు సహా 33 మందిని మధ్యప్రదేశ్ పోలీసులు రక్షించారు.
బుర్హాన్‌పూర్ పోలీసు బృందం, మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా స్థానిక యంత్రాంగం సహకారంతో సోమవారం ఈ కూలీలు, చిన్నారులను సురక్షితంగా విడిపించిందని అధికారులు వెల్లడించారు.
విడిపించిన వారిలో పది మంది కూలీలు, వారి ఎనిమిది మంది పిల్లలు బుర్హాన్‌పూర్ జిల్లాకు చెందిన వారు కాగా.. ఎనిమిది మంది కూలీలు, వారి ఏడుగురు పిల్లలు మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాకు చెందిన వారని మంగళవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
సుమారు రెండు నెలల క్రితం చెరుకు కోత పనుల కోసం వీరిని మహారాష్ట్రకు తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. ఒక కాంట్రాక్టర్ వీరిని అహల్యానగర్ జిల్లాలోని మరో కాంట్రాక్టర్‌కు అప్పగించగా, సదరు కాంట్రాక్టర్ వీరిని ధారాశివ్ జిల్లాలో బలవంతంగా వెట్టిచాకిరీలో దించాడు. తమకు సరైన రేషన్, కూలీ డబ్బులు ఇవ్వాలని బాధితులు అడగటంతో కాంట్రాక్టర్, అతని అనుచరులు వారిపై దాడి చేసి, మొబైల్ ఫోన్లను లాక్కున్నారని బాధితులు పోలీసులకు వివరించారు.
ఈ కేసులో నిందితులు పరారీలో ఉన్నారని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారిక ప్రకటనలో తెలిపారు. కాగా, 'వెట్టిచాకిరీ వ్యవస్థ (రద్దు) చట్టం, 1976' ప్రకారం దేశవ్యాప్తంగా వెట్టిచాకిరీ పూర్తిగా నిషేధించబడింది. ఈ చట్టం వెట్టిచాకిరీ కార్మికులకు విముక్తి కల్పించడంతో పాటు, వారి అప్పులను రద్దు చేస్తుంది. నేరస్థులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తుంది.







కామెంట్‌లు (0)