సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కావేరి జలాల వివాదం - బోర్డు ఆదేశాలు పాటించాల్సిందే : సుప్రీం కోర్టు

1 గంట క్రితం

Cauvery Water Dispute – Board's Orders Must Be Followed: Supreme Court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 03:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తమిళనాడు : కావేరీ జలాల పంపిణీ వివాదం పై సుప్రీం కోర్టులో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడుకు నీటిని విడుదల చేసే విషయంలో కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (CWMA) ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని కర్నాటక ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా తమిళనాడు తరపు సీనియర్ అడ్వకేట్ సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ... కర్నాటక ప్రభుత్వం అథారిటీ ఆదేశాలను పాటించడం లేదని, తమకు రావాల్సిన నీటిలో భారీగా కోత పడిందని కోర్టు దృష్టికి తెచ్చారు. రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వ ఉన్నప్పటికీ, రైతులకు అవసరమైన నీరు అందడం లేదని ఆరోపించారు. మరోవైపు కర్నాటక తరపు సీనియర్ అడ్వకేట్ శ్యామ్ దివాన్ ఈ వాదనలను ఖండించారు. కావేరీ బేసిన్‌లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, కరవు ఛాయలు ఉన్నప్పటికీ తాము ఆదేశాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సీడబ్ల్యూఎంఏ ఆదేశాల మేరకు ఇప్పటికే కొంత నీటిని విడుదల చేశామని, సోమవారం ఉదయం నాటికి ప్రవాహం సెకనుకు 12 వేల 607 క్యూసెక్కులకు పెరిగిందని, రిజర్వాయర్ గేట్లు కూడా ఎత్తినట్లు కోర్టుకు వివరించారు. ఇరువైపు వాదనలను విన్న ధర్మాసనం... అథారిటీ ఆదేశాల అమలుపై పూర్తి స్థితిగతుల నివేదికను (Status Report) సమర్పించాలని ఆదేశించింది. నీటి విడుదలపై తదుపరి పరిశీలన కోసం తదుపరి విచారణను వచ్చే సోమవారం ఆగస్టు 24వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. చట్టబద్ధమైన సంస్థల ఆదేశాలను అమలు చేయడంలో ఇరు రాష్ట్రాలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని సూచించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్