స్టీలు పళ్లాలు, చెంచా మోగిస్తూ నినాదాల హోరు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే : అభిజిత్
జంతర్ మంతర్ వద్ద సిజెపి భారీ ఆందోళన
లైట్లు ఆపేయడంతో మొబైల్ ఫోన్ లైట్ల వెలుగులోనే నిరసన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘‘ప్రధాన్ గో బ్యాక్, గో ప్రధాన్ గో’’ అన్న నినాదాలతో ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రతిధ్వనించింది. స్టీల్ పళ్లాలను చెంచాలు మోగిస్తూ విద్యార్థులు, యువత నినాదాలు హోరెత్తించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కదలబోనని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్, సిబిఎస్ఇ అవకతవకలు వంటి విద్యా రంగ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్‌టిఎను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిజెపి శనివారం నాడిక్కడ జంతర్ మంతర్ వద్ద తమ రెండో దశ ఆందోళనను చేపట్టింది. నీట్ గందరగోళం మధ్య ఆత్యహత్య చేసుకున్న విద్యార్థుల చిత్రపటాలకు తొలుత నివాళులర్పించారు. స్టీల్ పళ్లాలను చెంచాలతో మోగిస్తూ ‘‘ప్రధాన్ గో బ్యాక్, గో ప్రధాన్ గో’’ అంటూ నినాదాలు హోరెత్తించారు. జాతీయ జెండాలతోపాటు అంబేద్కర్, భగత్ సింగ్, మహాత్మా గాంధీ, పూలే వంటి ప్రముఖుల చిత్రపటాలు, రాజ్యాంగం కాపీలను చేబూని వేలాది మంది విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనలో భాగస్వామ్యం అయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థి, యువజనులు రాజధానిలో కదంతొక్కారు. జంతర్ మంతర్ జనసంద్రంలా మారింది.
బారికేడ్లు.. తుపాకులు...
పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీసులు కలిసి జంతర్ మంతర్ వద్ద తుపాకులతో మకాం వేశారు. జంతర్ మంతర్, దానిని ఆనుకుని ఉన్న రహదారుల చుట్టూ పలు దఫాలుగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. రిజర్వ్ బలగాలను సిద్ధంగా ఉంచారు. మండుటెండలో వేలాది మంది యువత పళ్లాలు, చెంచాలు పట్టుకుని వచ్చారు. అభిజిత్ జాతీయ జెండాతో పాటు గాంధీ, అంబేద్కర్ చిత్రాలతో వేదికపైకి చేరుకున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ తరువాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల చిత్రాలకు ఆయన పూలు సమర్పించి, మౌనం పాటించారు. శనివారం నాటి ఆందోళనను విచ్ఛిన్నం చేయడానికి బిజెపి ప్రయత్నించింది. గోడీ మీడియా ఆందోళన వద్దకు వెళ్లి రెచ్చగొట్టే ప్రశ్నలు అడగడం కొనసాగించారు. కార్యకర్తలు దీనిని వ్యతిరేకించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని గోడీ మీడియాను అక్కడి నుంచి పంపించివేశారు.
5 గంటల వరకే పోలీసుల అనుమతి...
మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన ఈ ఆందోళనకు సాయంత్రం 5 గంటల వరకే పోలీసులు అనుమతించారు. సమయం పొడిగించాలన్న దీప్కే విజ్ఞప్తిని ఢిల్లీ పోలీసులు తిరస్కరించారు. అక్కడి నుంచి ఆందోళనకారులను బలవంతంగా ఖాళీ చేయించడానికి పోలీసులు అన్ని విధాలా ప్రయత్నించగా, యువత ప్రతిఘటించారు. పోలీసులు మైక్రోఫోన్ కనెక్షన్‌ను నిలిపివేశారు. చీకటి పడగానే లైట్లను ఆర్పివేశారు. నీటి సరఫరాను నిలిపివేశారు. ఆందోళన ప్రాంతం నుండి బయటకు వెళ్లిన వారిని, లోపలికి రాకుండా అడ్డుకున్నారు. మీడియాను కూడా నియంత్రించేందుకు ప్రయత్నించారు. యువత ఈ చర్యలన్నింటినీ వ్యతిరేకించి, మొబైల్ ఫోన్ లైట్ల వెలుగులో ఆందోళనను కొనసాగించారు.
ఆహారాన్ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తాం : దీప్కే
జంతర్ మంతర్‌లోకి నీరు, ఆహారాన్ని తీసుకువెళ్లడానికి ఢిల్లీ పోలీసులు అనుమతించడం లేదని అభిజీత్ దీప్కే అన్నారు. మహాత్మా గాంధీ కూడా నిరాహార దీక్ష చేశారని, తాము కూడా నిరాహార దీక్ష చేస్తామని ఆయన అన్నారు. "కానీ చరిత్ర రాసినప్పుడు, మిమ్మల్ని జనరల్ డయ్యర్‌తో పోలుస్తారు. ఆ ప్రాంతంలోకి నీరు, ఆహారాన్ని అనుమతించాలని మేము ఢిల్లీ పోలీసులను మరోసారి కోరుతున్నాము. భగత్ సింగ్ ఆందోళన చేస్తున్నప్పుడు బ్రిటిష్ వారు కూడా వారికి నీళ్లు ఇచ్చారు" అని ఆయన అన్నారు. "ఈ చీకట్లో నాపై ఏదైనా దాడి జరిగితే, లైట్లు ఆపివేసిన వారే బాధ్యులవుతారు" అని దీప్కే అన్నారు. "తాగునీటి సరఫరాను నిలిపివేయడానికి బారికేడ్ల వద్ద పోలీసులు మోహరించారు. మీరు ఇంతైనా ప్రయత్నం చేసి ఉంటే, పేపర్ లీకేజీలు జరిగి ఉండేవి కావు. 12 మంది ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు" అని ఆయన అన్నారు.
పదేపదే కోరడంతో రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు లైట్లు ఆన్ చేశారు. న్యాయం కోసం ఎంతకైనా తెగిస్తామని అభిజీత్ దీప్కే ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగుతుందని ప్రకటించారు. "అయితే నేను అడగాలనుకుంటున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా మంత్రిగా ఎందుకు కొనసాగుతున్నారు? చట్టం కేవలం మా కోసమేనా? మీ నిరసన సమయం ముగిసిందని ఢిల్లీ పోలీసులు మాకు హెచ్చరిక ఇస్తున్నారు. మంత్రివర్గంలో మీ సమయం ముగిసిందని మీరు ధర్మేంద్ర ప్రధాన్‌కు కూడా హెచ్చరిక ఇవ్వాలి" అని దీప్కే సూచించారు. "మన ప్రజా ప్రతినిధుల పిల్లలు కూడా అందరి పిల్లలతో పాటు ఒకే పాఠశాలలకు వెళ్లినప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది" అని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు.
తరలివచ్చిన యువత
జూన్ 6న జరిగిన ఆందోళనలో పాల్గొన్న వారి కంటే శనివారం ఎక్కువమంది రావడంతో ఈ ప్రాంతం జనసంద్రంగా మారింది. సిజెపి ఆహ్వానం మేరకు ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎ, ఎఐఎస్ఎఫ్ వంటి విద్యార్థి సంఘాల కార్యకర్తలు ఆందోళనలో భాగస్వాములయ్యారు. ఎస్ఎఫ్ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి ఐషీఘోష్ ఈ ఆందోళనలో పాల్గొని మాట్లాడారు.









కామెంట్‌లు (0)