బెళగావి: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించి సుమారు 28 ఎకరాల చెరకు పంట దగ్ధమైంది. ఈ ఘటనలో దాదాపు రూ.1 కోటి మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అథాని తాలూకాలోని నది ఇంగలగావ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైతులైన బసప్ప చన్నన్నవర, ఈరప్ప చన్నన్నవర, గురుబసు తేవరమణి, చనగౌడ రాచగౌడ, అప్పసభ గిరమల్లాన్నవర, రామన్న గిరమల్లాన్నవరలకు చెందిన చెరకు పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటలు సుమారు 28 ఎకరాల్లోని చెరకు పంటను పూర్తిగా దహనం చేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పటికే పెద్ద మొత్తంలో పంట అగ్నికి ఆహుతైంది. ఏడాది పాటు ఎంతో కష్టపడి, పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట కోతకు సిద్ధమవుతున్న సమయంలో నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
ఈ ప్రమాదంతో తమ జీవనాధారం దెబ్బతిన్నదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి, తగిన పరిహారం అందించాలని ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాగా, అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.







కామెంట్‌లు (0)