శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జెన్‌ జెడ్ ఘన విజయం

1 గంట క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 12:22 పూర్వాహ్నం | 7 నిమిషాల చదవడం

• ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

• ప్రహ్లాద్‌ జోషికి విద్యాశాఖ బాధ్యతలు అప్పగింత

• డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో ఆందోళన విరమించిన సిజెపి

​చరిత్రలో కొన్ని రోజులకే ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. 2026 జులై 25కు అటువంటి గుర్తింపే దక్కింది! యువతరం శిరమెత్తితే..నవతరం గళం విప్పితే ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పిన రోజిది! భారత ప్రజాస్వామ్య చరిత్రలో జెన్‌ జెడ్‌ ‌తొలి విజయం సాధించింది! పరీక్షా పత్రాలు లీక్‌ అయినా, విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడినా ఏమీ పట్టనట్టు వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి కొత్త చర్రితను లిఖించింది. జెన్‌ ‌జెడ్ ఉద్యమ ధాటికి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించక తప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో , మరో మార్గం లేక ఆయన శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఉదృతంగా ఉద్యమం సాగుతున్నా తప్పించుకు తిరిగిన ఆయన చివరకు తన రాజీనామా లేఖలో ‘యువత ఆకాంక్షల మేరకు...’ అని పేర్కొనక తప్పలేదు. ధర్మేంద్ర ప్రధాన్‌ ‌స్థానంలో ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడానికి, ఆందోళనకారులపై కేసుల ఎత్తివేతకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సిజెపి ఆందోళనను విరమించింది. 72 రోజుల పాటు సాగిన ఈ పోరాటానికి, యువత తరలి రావడానికి ఏ నాయకుడు బస్సులను ఏర్పాటు చేయలేదు. అయితే, పోరాటం మొదలైన మొదటి రోజు నుండి సిపిఎం, వామపక్షాలు అండగా నిలిచాయి. స్వచ్చందంగా కదిలిన యువత తమ సమస్యను తామే నిర్వచించుకుంది. తమ ఉద్యమాన్ని తామే నిర్మించుకుంది. ఇటీవల కాలంలో అత్యంత సహజంగా మారిన కుల, మతాల విద్వేష భావాలను దూరం పెట్టింది. లాఠీ దెబ్బలలను, కరెంటు షాక్‌‌లను, టియర్‌ ‌గ్యాస్‌ ‌షెల్స్‌‌ను, వాటర్‌ ‌కెనాన్లను ఐక్యంగా ఎదుర్కుంది. చివరకు హిట్లర్‌, గోబెల్స్‌ ‌వారసత్వపు పోకడలు ఎల్లకాలం చెల్లవంటూ విజయం సాధించింది! ధర్మేంద్ర ప్రసాద్‌ ‌రాజీనామా ప్రకటన తరువాత కాక్రోచ్‌ ‌జనతా పార్టీ వ్యవస్థాసకుడు అభిజిత్‌ ‌దీప్కే ఇది ఆరంభం మాత్రమే అని తమ పోరాటం ఇంకా ముగియలేదని ప్రకటించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ దీనిని విద్యార్థుల విజయంగా అభివర్ణించారు. ‘ఇది మొదటి అడుగు మాత్రమే’ అని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి అన్నారు.

​ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్ ప్ర‌శ్నాప‌త్రం లీక్, సిబిఎస్‌ఇ అవ‌క‌త‌వ‌క‌లకు జవాబుదారీత‌నం వ‌హిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ గ‌త 36 రోజులుగా కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సిజెపి) ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ విద్యార్థి, యువ‌త చేసిన ఉద్య‌మం విజ‌యం సాధించింది. ఎట్ట‌కేల‌కు కేంద్ర మంత్రి రాజీనామాతో పాటు సిజెపి ప్ర‌తిపాదించిన డిమాండ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అంగీక‌రించ‌డంతో విద్యార్థి, యువ‌త విజ‌య యాత్ర చేప‌ట్టారు. జంత‌ర్ మంత‌ర్‌లో సంబ‌రాలు మిన్నంటాయి. ఐక్య పోరాట నినాదాల‌తో ఆ ప్రాంత‌మంతా మార్మోగింది. ఇదొక చారిత్రాత్మ‌క విజ‌యం, ప్ర‌జాస్వామ్య విజ‌యమంటూ విద్యార్థి, యువ‌జ‌న సంఘాల‌ నేత‌లు పేర్కొంటే, ఇది భ‌విష్య‌త్తుకు స్ఫూర్తి, విద్యార్థుల‌, యువ‌త స‌మిష్టి విజ‌యమ‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు అంటున్నారు. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాతో పాటు ఇత‌ర డిమాండ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అంగీక‌రిస్తూ హామీ ఇవ్వడంతో ఆందోళ‌న‌లు విరమిస్తున్న‌ట్లు సిజెపి ప్ర‌క‌టించింది.

సిజెపి, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎ, ఎఐఎస్ఎఫ్‌, త‌దిత‌ర విద్యార్థి సంఘాల‌ నాయకత్వంలో జంతర్ మంతర్ వద్ద ప్రారంభమై, ఆ తరువాత‌ దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ శక్తివంతమైన ఉద్య‌మం, బిజెపి రాజకీయ రక్షణ వలయాన్ని బద్దలు కొట్టి, ప్రధాన్ చేత రాజీనామా చేయించింది. ఈనెల 20న సిజెపి నిర్వహించిన పార్లమెంట్‌ మార్చ్‌ అనంతరం మోడీ, ప్రధాన్ రాజీనామాను నివారించడానికి అన్ని ఎత్తుగడలూ వేసినా విఫలమయ్యారు. పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష కూడా ప్రభుత్వ వ్యతిరేక అలలను సృష్టించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయడానికి, పరీక్షలలో మోసానికి పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించడానికి ఒక బిల్లును ప్రవేశపెట్టినా, ఎన్‌టిఎలో కీల‌క అధికారుల‌ను తొల‌గించిన‌ప్ప‌టికీ, విద్యార్థులు ప్రధాన్ రాజీనామాకే కట్టుబడి ఉన్నారు. పోలీసుల అణచివేతను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఒక కొత్త పోరాట గాథను లిఖించారు. ‘‘ఇది మొదటి విజయం. మనం ఇక్కడితో ఆగిపోము. ఇది కేవలం ఆరంభం మాత్రమే. గత 36 రోజులుగా ఇక్కడ కూర్చుని ఉన్న విద్యార్థులందరికీ, స్వచ్ఛంద కార్యకర్తలందరికీ నేను వందనం చేస్తున్నాను’’ అని సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు.

చ‌ర్చ‌లు స‌ఫ‌లం...ఆందోళన విరమణ

సిజెపి ప్ర‌తిపాదించిన‌ మూడు ప్రధాన డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం, సిజెపి ప్ర‌తినిధుల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం శనివారం సాయంత్రం కాన్టిట్యూషన్ క్లబ్‌లో కేంద్ర మంత్రులు జెపి న‌డ్డా, జితేంద్ర సింగ్‌, సిజెపి ప్ర‌తినిధులు సౌర‌వ్ దాస్‌, అశుతోష్ రంకా మ‌ధ్య మూడో ద‌శ చ‌ర్చ‌లు జ‌రిగాయి. అనంత‌రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో కేంద్ర మంత్రులు, సిజెపి ప్ర‌తినిధులు మాట్లాడారు. సిజెపి ప్ర‌తినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ ‘ప్రభుత్వ ప్రతినిధులతో మూడు రౌండ్లు చర్చలు జరిపాం. మూడు ప్రధాన డిమాండ్లతలో మేము జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా నిరసన చేపట్టాం. వీటిలో మొదటిది.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నిరసనకారులు, సిజెపి నేతలపై ఢిల్లీ, బిజెపి పాలిత రాష్ట్రాల్లో పోలీసులు పెట్టిన కేసులు, ఎఫ్‌ఐఆర్‌లను విరమించుకోవాలి. అంతేకాదు.. భవిష్యత్తులో నీట్ నిరసనకారులపై ఎలాంటి కేసులు పెట్టొద్దు. అలానే నీట్ పరీక్ష రద్దుతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటంబాలకు రూ.1 కోటి పరిహారం చెల్లించాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో మా మొదటి డిమాండ్ నెరవేరింది. మిగతా డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇచ్చారు’ అని అన్నారు. సిజెపి ప్రతినిధులు తమ ఆందోళనను విరమిస్తున్నామని ప్రకటించారు. జంతర్‌మంతర్‌‌ నుంచి విద్యార్థులు, యువత తిరిగి వెళ్లాలని కోరారు. తాము ఆశించిన చర్యలను కేంద్రం త్వరిత గతిన తీసుకుంటుందన్న విశ్వాసంతో ఆందోళనను విరమిస్తున్నామని అన్నారు.

​ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా

దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున్న సాగుతున్న ఈ ఉద్యమానికి దిగొచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన రాజీనామా లేఖను పంపినట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. లేఖ ద్వారా ఆయన పరీక్షల నిర్వహణ, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, రాజీనామా నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను దేశ ప్రజలకు సుదీర్ఘంగా వివరించారు. తొలి రోజు నుంచే ఈ ఘటనకు తానే పూర్తి బాధ్యత వహించానని, పరీక్షల మాఫియా కారణంగా ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి భవిష్యత్తు పాడవకుండా చూసేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. . ఈ ఆందోళన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థానికి వాడుకోకూడదని, దేశ ఐక్యత దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రధాన్ రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే, జంతర్ మంతర్ వద్ద ఉన్న సిపిఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్‌ను అభిజిత్ దీప్కే ఆలింగనం చేసుకున్నారు. ఆదివారం నాడు ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా విజయ దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది.

​ప్రజాస్వామ్యం గెలిచింది : అభిజీత్ దీప్కే

బొద్దింకల సత్తా అందరికీ తెలిసొచ్చిందని సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. నీట్ పేపర్ లీక్ బాధితులకు న్యాయం దక్కిందని వ్యాఖ్యానించారు. బొద్దింకలు ఒకసారి వస్తే వెళ్లగొట్టడం సాధ్యం కాదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది విద్యార్థుల విజయమని అన్నారు. తమని తాము బాద్షాలుగా భావిస్తున్న వారిని దారిలోకి తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. యువత ఓట్లతోనే వారు నేడు అధికారంలో ఉన్నారన్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. పాలకులను అదుపులో ఉంచాల్సిన అవసరం ఉందని కూడా ఉన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్యం, విద్యార్థులు సాధించిన విజయంగా పేర్కొన్నారు. నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదంపై కొన్ని వారాలుగా కొనసాగిన నిరసనల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా విద్యార్థులు ఒత్తిడి తెచ్చారని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల సామూహిక సంకల్పానికి లభించిన విజయమని ఆయన అభివర్ణించారు. నిరంతర శాంతియుత నిరసనలు మార్పును తీసుకురాగలవని చెప్పడానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక నిదర్శనమని అభిజీత్ దిప్కే తెలిపారు. అలాగే నీట్ పేపర్ లీక్ వివాదం తరువాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల పేర్లను దీప్కే గుర్తు చేసుకున్నారు. వారి స్మృతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని నిరసనకారులను కోరారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాపై నిరసన ప్రాంగణంలో విద్యార్థుల సంబరాలు హోరెత్తాయి.

​యువత సాధించిన విజయం: సోన‌మ్ వాంగ్‌చుక్‌

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ హర్షం వ్యక్తం చేశారు. ఇది పట్టుదలతో యువత సాధించిన విజయని పేర్కొన్నారు. జెన్-జి, సిజెపి ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో శనివారం ఓ పోస్టు పెట్టారు. ‘ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఇది శాంతి, ఓర్పు, నిరంతర పట్టుదలల విజయం. దేశంలోని సిజెపి, జెన్-జి యువతకు అభినందనలు. భయాన్ని వీడి దేశం నలుమూలల నుంచి పోరాటానికి కదలివచ్చిన పౌరులందరికీ ధన్యవాదాలు. ఇప్పటివరకు బాధ్యతాయుతమైన సమాధానం కోరాం. ఇకపై సంస్కరణల వైపు సాగుదాం’ అని పేర్కొన్నారు.

​వారే నిజమైన దేశభక్తులు: రాహుల్‌ గాంధీ

రాహుల్ గాంధీ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా లభించిన విజయమని అన్నారు. విద్యారంగంలో సంస్కరణలు, బాధ్యతాయుత వైఖరిని వారు పట్టుబట్టి సాధించుకున్నారని అన్నారు. అయితే, ప్రభుత్వంపై తమ పోరాటం మాత్రం కొనసాగుతుందన్నారు. ‘దేశ‌ విద్యారంగం మనందరికీ గర్వకారణంగా ఉండేది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కేవి. కానీ ఏళ్ల కొన్నేళ్లుగా ప్రైవేటీకరణ చొచ్చుకొచ్చింది. ఇందుకు ప్రతిస్పందనగానే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఇకపై గట్టి చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. విద్యార్థులకు ప్రధాని కూడా క్షమాపణ చెప్పాలని అన్నారు. నిరసనల్లో హింసాత్మక ఘటనలకు అమిత్ షానే కారణమని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉద్యమించిన విద్యార్థులకు హ్యాట్సాఫ్‌ చెబుతూ, వారే నిజమైన దేశభక్తులని కొనియాడారు. విద్యార్థులు తమ హక్కుల కోసం, పారదర్శకమైన విద్యా వ్యవస్థ కోసం చేసిన పోరాటం దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని రాహుల్‌ పేర్కొన్నారు.

యువతకు ఎంఎ బేబీ జేజేలు : సిపిఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ

ఈ గొప్ప విజయానికి దేశ‌ విద్యార్థులకు, యువతకు అభినందనలని సిపిఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ అన్నారు. ‘‘ప్రధాన్ రాజీనామా అనేది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఇప్పుడు ఎన్‌టిఎను రద్దు చేయాలి. అలాగే విద్యార్థి వ్యతిరేక, వాణిజ్యపరమైన, మతతత్వ ధోరణి కలిగిన ఎన్ఇపి-2020ని కూడా వెనక్కి తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. నిరసనకారులపై బనాయించిన కేసులను ఎత్తివేయాలని, మన విద్యార్థులపై అమానుషంగా దాడి చేసిన పోలీసు సిబ్బంది అందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ‘అభిజీత్ దీప్కే, సోనమ్ వాంగ్‌చుక్‌, ఎస్ఎఫ్ఐ నేత‌ల‌తో స‌హా పోరాటం మార్గంలో దృఢంగా నిలిచి, అన్ని ర‌కాల బెదిరింపుల‌ను ధైర్యంగా ఎదుర్కొన్న విద్యార్థి సంఘాల‌న్నింటికీ కూడా అభినంద‌న‌లు. క్రీడలు, కళలు, సినిమా, సంస్కృతి వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడం ఎంతో సంతోషకరం. ఐక్య పోరాటాలు విజయాన్ని సాధిస్తాయని ఈ అనుభవం మనకు తెలియజేస్తోంది. మన డిమాండ్లన్నీ నెరవేరే వరకు మనం దృఢంగా ఉంటూ పోరాటాన్ని కొనసాగించాలి. ముందుకు సాగుదాం మిత్రులారా’ అని పేర్కొన్నారు.

విద్యార్థుల గర్జనకు తలదించిన అహంకారం

కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే

దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్న లక్షలాది మంది విద్యార్థుల గొంతుక ఎట్టకేలకు అహంకారుల గడపలో ప్రతిధ్వనించింది. విద్యార్థుల గర్జనకు అహంకారం తలదించింది. ఇది సత్యానికి లభించిన విజయం. అధికారపక్ష మొండితనానికి ఎదురైన ఓటమి. ప్రభుత్వ అవినీతి వల్ల రక్తాన్ని, పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు లభించిన విజయం ఇది. విద్యార్థుల ప్రయోజనాల కోసం పార్లమెంటు నుంచి వీధుల వరకు గళం విప్పిన ప్రతిపక్షాల ఐక్యతా సంఘటనకు దక్కిన గెలుపు ఇది. ఇప్పుడు మన యువతరానికి ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పి, వారిపై లాఠీలు, లాఠీలు, పెల్లెట్ గన్‌లు ప్రయోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్