పుల్లేటికుర్రులో మతిస్థిమితం లేని వ్యక్తి చేతిలో వృద్ధుడి హత్య
సంత మార్కెట్లో వెనుక నుండి కత్తితో దాడి.. ఘటనా స్థలంలోనే మృతి
ప్రజాశక్తి-అంబాజీపేట (కోనసీమ) : అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామంలో శుక్రవారం ఉదయం దారుణ హత్య చోటుచేసుకుంది. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి దింపు కత్తితో దాడి చేయడంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన పిట్ల ప్రసాద్ (38) గత కొంతకాలంగా దింపులు తీస్తూ జీవనం సాగించేవాడు. అయితే గత కొన్ని రోజులుగా అతడు మతిస్థిమితం కోల్పోయి గ్రామంలో పిచ్చిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో గ్రామానికి చెందిన మామిడిశెట్టి సత్యనారాయణ (76) పై ప్రసాద్ ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. దింపులు తీసే కత్తితో వెనుక వైపు నుండి విచక్షణారహితంగా దాడి చేయడంతో సత్యనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉదయాన్నే జరిగిన ఈ ఘటనతో పుల్లేటికుర్రు గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న సీఐ భీమరాజు ,ఎస్ఐ సుభాని లు తన సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హత్య జరిగిన తీరును పరిశీలించి, స్థానికుల నుండి వివరాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కత్తి తో నరికిన దింపు కార్మికుడు ప్రసాద్







కామెంట్‌లు (0)