న్యూఢిల్లీ : అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం కేసులో సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు సోమవారం ముగించింది. నగదును లెక్కించే సమయంలోనే నిధుల దుర్వినియోగం జరిగినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి వివరించారు. నిందితుల్లో కొందరు దుర్వినియోగం చేసిన సొమ్ముతో ఆస్తులు కొనుగోలు చేయగా, మరికొందరు బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను అయోధ్య స్థానికన్యాయస్థానంలో కొనసాగించాలని సూచించింది. ఈ కేసులో పిటిషనర్లు ట్రయల్ కోర్టుకు సహకరించేందుకు అనుమతించింది. ప్రజాప్రయోజన అంశం ఇమిడి ఉన్నందున, ‘‘నేర బాధితులు’’ కోర్టుకు సహకరించేందుకు చట్టం కల్పించిన వెసులుబాటు తరహాలో పిటిషనర్లు కూడా సహకరించవచ్చని ధర్మాసనం పేర్కొంది. నేర బాధితులు కోర్టుకు సహకరించేందుకు న్యాయస్థానాలు అనుమతిస్తున్నాయని, అదే విధంగా పిటిషనర్లు కూడా కోర్టుకు సహకరించాలని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ఈ వ్యవహారంలో ప్రజాప్రయోజన అంశం ఉన్నందున చట్టం ప్రకారం కోర్టుకు సహకరించే అవకాశం ఉందని ఆయన వివరించారు. రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకలకు సంబంధించిన ఆధారాలు, రికార్డులు, సిసిటివి ఫుటేజీ, ఇతర డిజిటల్ లాగిన్‌లను భద్రపరచాలని, కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆరోపణలపై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
రామమందిరం కేసు : సిబిఐ విచారణ కోరిన పిటిషన్లను ముగించిన సుప్రీంకోర్టు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026, 03:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)