సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బీహార్‌ ఆలయంలో ఘోరం

17 ఆగస్టు, 2026

seven
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 09:34 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • తొక్కిసలాటలో ఏడుగురి మృతి,10 మందికి గాయాలు

  • ఉజ్జయినిలోనూ ఇదే తరహా ఘటన

పాట్నా : బీహార్‌‌లోని ఒక ఆలయంలో సోమవారం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. లఖిసరాయి పట్టణం అశోక్‌ ‌ధామ్‌ ఆలయానికి సోమవారం యాత్రికులు పోటెత్తారు. రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు చేయకపోవడం, విద్యుత్ స్తంభం విరిగిపోయిందనే వదంతుల కారణంగా ఈ తొక్కిసలాట సంభవించిందని స్థానికులు తెలిపారు. రెండు రైళ్లు ఒకే సమయానికి లఖిసరాయ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాయి. ఈ రైళ్లలో ఎక్కువ మంది మహిళలేనని, వీరంతా పవిత్ర జలాన్ని సమర్పించడానికి రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఆలయానికి ఒకే సమయంలో చేరుకున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీన్ని గుర్తించినా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని వారు విమర్శించారు. ఈ రద్దీ సమయంలో గందరగోళానికి వెదురుతో ఏర్పాటు చేసిన బారికేడ్ కూలిపోయిందని చెప్పారు. ఆదే సమయంలో సమీపంలో ఉన్న పొలంలో ఒక విద్యుత్ స్తంభం విరిగిపడింది. దీంతో వెనుక నుంచి వస్తున్న కొందరు విద్యుత్ స్తంభం కూలిపోయిందని బిగ్గరగా ఆరవడం ప్రారంభించారు. దీంతో క్యూలైన్లలో తొక్కిసలాట ప్రారంభమైంది. కొంతమంది కిందపడిపోయారు.

వెనుక ఉన్న వారు వీరిని తొక్కుకుంటూ వెళ్లడంతో ప్రాణనష్టం జరిగింది. గాయపడిన వారిని లఖిసరాయ్ సదర్ (టౌన్) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాల్ని పోస్టు మార్టం కోసం తరలించారు. మృతులు మన్మలా దేవి (44), సోని దేవి (50), రింకు దేవి (50), హేమలతా దేవి (55), లలితా దేవి (45), సంగీతా దేవి (40)గా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తునట్లు అధికారులు తెలిపారు. ఘటనపై సిఎం సమ్రాట్ చౌదరి, మాజీ సిఎం నితీష్‌‌కుమార్‌, ప్రతిపక్ష నేత, ఆర్‌‌జెడి నాయకులు తేజస్వియాదవ్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ‌సిఎం ప్రకటించారు. సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడమే ఈ ఘటనకు కారణమని, ఇది ఎన్‌‌డిఎ ప్రభుత్వ "పరిపాలనా వైఫల్యాన్ని" ప్రతిబింబిస్తోందని తేజస్వియాదవ్‌ ‌పేర్కొన్నారు.

​ఉజ్జయిని ఆలయంలోనూ తొక్కిసలాట...

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలోని మహకాళేశ్వర ఆలయ ప్రాంగణం శ్రీ హరసిద్ధి మాతా శక్తిపీఠ్ ఆలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. విద్యుత్ షాక్ తగిలిందనే ప్రచారం జరగడంతో ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయాలపాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్